Telugu Global
National

మ‌లుపులు లేని రోడ్ల వల్లే ప్రమాదాలు.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం వింత వ్యాఖ్యలు

ప్రమాదాలు అధికంగా జరగడానికి గల కారణాలను మంత్రి చెబుతారనుకుంటే.. రోడ్లు బాగుండటం వల్ల డ్రైవర్లకు నిద్ర వస్తోందని.. దీనివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యలు చేయడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.

మ‌లుపులు లేని రోడ్ల వల్లే ప్రమాదాలు.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం వింత వ్యాఖ్యలు
X

మామూలుగా ఎక్కువ మలుపులు ఉన్న రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. మలుపుల్లో వేగాన్ని నియంత్రించుకోలేక వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. అందుకే సాధ్యమైనంత వరకు కొత్తగా నిర్మాణం చేపడుతున్న రోడ్లలో మలుపులు ఎక్కువగా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మలుపులు లేని రోడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వింత వ్యాఖ్యలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఛత్రపతి శంబాజీ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హాజరయ్యారు. జిల్లాలోని సమృద్ధి -మహామార్గ్ ఎక్స్ ప్రెస్ పై ఇటీవల కాలంలో ప్రమాదాల సంఖ్య పెరిగిందని, దీనికి కారణం ఏంటని మీడియా ప్రశ్నించగా.. డిప్యూటీ సీఎం వింత సమాధానం ఇచ్చారు. సమృద్ధి -మహామార్గ్ ఎక్స్ ప్రెస్ రోడ్లు అద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఎలాంటి మలుపులు లేకుండా రోడ్లు తిన్నగా ఉంటాయన్నారు. ఒంపులు లేని రోడ్లలో డ్రైవర్లకు నిద్ర మత్తు ఆవహిస్తుందని తెలిపారు. డ్రైవర్లు ఉన్నట్టుండి నిద్రలోకి జారుకుంటుండటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అజిత్ పవార్ వివరించారు.

ప్రమాదాలు అధికంగా జరగడానికి గల కారణాలను మంత్రి చెబుతారనుకుంటే.. రోడ్లు బాగుండటం వల్ల డ్రైవర్లకు నిద్ర వస్తోందని.. దీనివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యలు చేయడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటీ? ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరించకుండా విచిత్రమైన సమాధానం చెప్పడం తగదని మండిపడ్డారు.

First Published:  17 Sep 2023 6:36 AM GMT
Next Story