Telugu Global
National

టమాటాల దండతో రాజ్యసభకు.. ఎంపీపై చర్యలు

తమ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ గుప్త టమాటాల దండతో పార్లమెంట్ కు వచ్చే వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నది.

టమాటాల దండతో రాజ్యసభకు.. ఎంపీపై చర్యలు
X

పెరుగుతున్న టమాటాల రేట్లపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ గుప్త. టమాటాలతో దండ తయారు చేయింది, ఆ దండను ధరించి రాజ్యసభకు హాజరయ్యారు. ఆయన వాలకం చూసి తోటి సభ్యులు నవ్వుకున్నారు, కానీ ఆయన అందరి దృష్టిలో పడ్డారు. సోషల్ మీడియాలో ఆ వార్త వైరల్ గా మారింది.

అయితే సభకు టమాటాల దండతో రావడం సరికాదంటూ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశీల్‌ కుమార్‌ తీరు బాధ కలిగించిందని, బాధ్యతగల పార్లమెంట్ సభ్యుడు జనం దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారాయన. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రతిపక్ష నాయకుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.

ఆప్ విమర్శలు..

తమ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ గుప్త టమాటాల దండతో పార్లమెంట్ కు వచ్చే వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నది. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.


పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ఎద్దులబండిపై నాయకులు పార్లమెంట్ కి వచ్చి నిరసన తెలిపేవారు. గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినప్పుడు కూడా గ్యాస్ బండల్ని రోడ్లపై పెట్టి ఆందోళన చేసేవారు. టమాటా రేట్లపై కూడా ఇలాంటి నిరసన తెలిపారు ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ గుప్త, అయితే అనుకోకుండా ఆయన చైర్మన్ ఆగ్రహానికి కారణమయ్యారు.

First Published:  10 Aug 2023 12:44 AM GMT
Next Story