Telugu Global
National

అదిగో అవినీతి, ఇదిగో సాక్ష్యాలు.. ఆ గవర్నర్ మాకొద్దంటున్న ఆప్..

అధికార దుర్వినియోగానికి పాల్పడిన సక్సేనాను వెంటనే ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి తప్పించాలని ప్రధాని మోదీని కోరారు ఆప్ నేతలు. చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అదిగో అవినీతి, ఇదిగో సాక్ష్యాలు.. ఆ గవర్నర్ మాకొద్దంటున్న ఆప్..
X

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ వీకే సక్సేనా, రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ర‌గ‌డ‌ మరింత పెరుగుతోంది. లిక్కర్ కాంట్రాక్ట్ ల విషయంలో ఇటీవల పలువురు అధికారుల్ని తొలగించిన సక్సేనా తాజాగా ఆప్ కి సవాల్ విసిరారు. దీంతో ఆయన పాత వ్యవహారాలన్నీ ఇప్పుడు ఆప్ నేతలు తవ్వి తీస్తున్నారు. గతంలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (KVIC) ఛైర్మన్‌ గా సక్సేనా పనిచేశారు. ఆ సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆప్ ఆరోపిస్తోంది. ఆరోపణలే కాదు, ఇవిగో సాక్ష్యాలంటూ ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కమిషన్ చైర్మన్ హోదాలో ఓ కాంట్రాక్ట్‌ ను త‌న‌ కుమార్తెకు కేటాయించుకున్నారని ఆయన వివరించారు. ఆయన్ను తక్షణం ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.

సక్సేనా KVIC చైర్మన్ గా ఉన్న సమయంలో ఆయన కుమార్తెకు ముంబైలోని ఖాదీ లాంజ్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కాంట్రాక్ట్‌ ను కట్టబెట్టారనేది ప్రధాన ఆరోపణ. చైర్మన్ గా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అందుకే ఆ కాంట్రాక్ట్ అప్పగించారని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు. KVIC యాక్ట్ 1961 నిబంధనలను ఆయన ఉల్లంఘించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన సక్సేనాను వెంటనే ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి తప్పించాలని ప్రధాని మోదీని కోరారు ఆప్ నేతలు. చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో కోర్టును సైతం ఆశ్రయిస్తామని తెలిపారు.

అబ్బెబ్బే ఊరికే చేశాం..

ఈ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. దీనికి గవర్నర్ స్పందన మాత్రం హాస్యాస్పదంగా ఉంది. తాను చైర్మన్ గా ఉన్న సమయంలో తన కుమార్తె ఆ కాంట్రాక్ట్ చేయడం వాస్తవమేనని అయితే అందుకు ప్రతిఫలం తీసుకోలేదని చెప్పారు. ఉచితంగా తన కుమార్తె ఆ కాంట్రాక్ట్ చేసినట్టు చెప్పారు సక్సేనా, దానివల్ల KVIC కి లక్ష రూపాయలు మిగిలాయని అన్నారు. ఈమేరకు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

వెంటనే కౌంటర్..

గవర్నర్ కార్యాలయం ఇచ్చిన అతి తెలివి సమాధానానికి వెంటనే ఆప్ నేతలు కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీలో ఒక నేత కంప్యూటర్ ఇంజినీర్ అని, ఆయన ఉచితంగా చేస్తానంటే సెంట్రల్‌ విస్తా ఐటీ వర్క్‌ అప్పగిస్తారా అని ప్రశ్నించారు. ఇంకో నేత ఎంబీఏ చదివారని, ఆయన కూడా ఫ్రీ సర్వీస్ కి సిద్ధమైతే ప్రధాని కార్యాలయంలో మేనేజ్‌ మెంట్‌ వ్యవహారాలు అప్పగిస్తారా అని అడిగారు. ఇప్పుడీ వ్యవహారం ఢిల్లీ రాజకీయాలను వేడెక్కించింది.

First Published:  2 Sep 2022 3:35 PM GMT
Next Story