Telugu Global
National

ఆపరేషన్ లోటస్ పై దర్యాప్తు చేయాలి... సీబీఐ ఆఫీస్ ముందు ఆప్ ధర్నా

ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ చేపట్టిన 'ఆపరేషన్ లోటస్' పై దర్యాప్తు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

ఆపరేషన్ లోటస్ పై దర్యాప్తు చేయాలి... సీబీఐ ఆఫీస్ ముందు ఆప్ ధర్నా
X

వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసేందుకు బీజేపీ 'ఆపరేషన్ లోటస్' చేపట్టిందని, అందుకు సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుంటోందని ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు సీబీఐ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. 'ఆపరేషన్ లోటస్ పై దర్యాప్తు చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు.

AAP ప్రతినిధి బృందం ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌ను కలిసేందుకు ఆ ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి బుధవారం చేరుకుంది. అయితే వారికి లోపలికి అనుమతి లభించలేదు. సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ అపాయింట్‌మెంట్ కోరుతూ కార్యాలయానికి ఈ-మెయిల్ పంపించామని దానికి ఇప్పటి వరకు స్పందన రాలేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అతిషి అన్నారు.

'ఆపరేషన్ లోటస్' చాలా సీరియస్ అంశం కాబట్టి మాకు సీబీఐ డైరెక్టర్‌ను కలవడానికి సమయం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 'ఆపరేషన్ లోటస్' పై బీజేపీ రూ. 6,300 కోట్లు ఖర్చు చేసింది. దీనిపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలి . ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నిర్ధారించాలి" అని అతిషి విలేకరులతో అన్నారు.

ఆప్ నేతలను కలవడానికి సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆప్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, అతిషి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సీబీఐ ప్రధాన కార్యాలయంలోకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో సీబీఐ కార్యాల‌యం ఎదుట ధర్నా చేశారు.

First Published:  31 Aug 2022 2:36 PM GMT
Next Story