Telugu Global
National

కేంద్రం ఆర్డినెన్స్‌పై మ‌రోసారి సుప్రీం కోర్టుకు ఆప్

కేంద్రం తెచ్చిన‌ ఆర్డినెన్స్‌కు వ్య‌తిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జూలై 3వ తేదీ నుంచి నిరసనలు ప్రారంభించనున్నట్లు ఆప్ తెలిపింది.

కేంద్రం ఆర్డినెన్స్‌పై మ‌రోసారి సుప్రీం కోర్టుకు ఆప్
X

ఢిల్లీలో ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో కేంద్రం, ఆప్ ప్ర‌భుత్వాల‌ మ‌ధ్య కొన‌సాగుతున్న వివాదం శుక్ర‌వారం మ‌రోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సుప్రీం కోర్టు ఇప్పటికే కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే.. అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనిని వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ప్రభుత్వం.. తాజాగా దీనిని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్ర‌యించింది.

కేంద్రం తీరు రాజ్యాంగ విరుద్ధం..

కేంద్రం విడుద‌ల చేసిన ఈ ఆర్డినెన్స్ ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ అధికారాలను దూరం చేస్తుందని ఢిల్లీ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ఇది కార్యనిర్వాహక వ్యవస్థ విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని తెలిపింది.

జూలై 3 నుంచి నిర‌స‌న‌లు..

మరోవైపు.. కేంద్రం తెచ్చిన‌ ఆర్డినెన్స్‌కు వ్య‌తిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జూలై 3వ తేదీ నుంచి నిరసనలు ప్రారంభించనున్నట్లు ఆప్ తెలిపింది. ఆర్డినెన్స్‌పై పోరులో భాగంగా కేజ్రీవాల్ ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నేతలను కలిసి మద్దతు కోరారు. బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమైతే.. ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఓడించవచ్చని ఆయ‌న చెప్పారు. అయితే, ఇటీవల విపక్షాల భేటీ సందర్భంగా ఆర్డినెన్స్ అంశంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడం గమనార్హం. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌లో విప‌క్షాల బ‌లం ఏ మేర‌కు స‌రిపోతుంద‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే.

First Published:  1 July 2023 2:26 AM GMT
Next Story