Telugu Global
National

టార్గెట్ మోదీ.. భారత్ యాత్రకు కేజ్రీవాల్ రెడీ..

మేక్ ఇండియా నెంబర్-1 ఇదీ ఆయన స్లోగన్. భారత్ ని నెంబర్-1 స్థానంలో నిలబెడతాం అనే నినాదంతో జనాల్లోకి రాబోతున్నారు కేజ్రీవాల్. 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా సత్తా చూపించాలంటే ఇప్పటినుంచే కష్టపడాలనేది కేజ్రీవాల్ ఆలోచన.

టార్గెట్ మోదీ.. భారత్ యాత్రకు కేజ్రీవాల్ రెడీ..
X

ఒక్కో రాష్ట్రాన్నీ హస్తగతం చేసుకుంటూ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ నేరుగా మోదీనే ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. భారత దేశ యాత్రకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటి వరకూ ఉత్తరాదినే కాస్త పట్టు ఉంది. దక్షిణ భారత దేశంలో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోంది. ఈ దశలో ఇక్కడ కూడా తన ఉనికి చాటుకుని, దేశవ్యాప్తంగా బీజేపీకి చెమటలు పట్టించాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్ భారత్ యాత్రకు సిద్ధమవుతున్నారు.

మేక్ ఇండియా నెంబర్-1 ఇదీ ఆయన స్లోగన్. భారత్ ని నెంబర్-1 స్థానంలో నిలబెడతాం అనే నినాదంతో జనాల్లోకి రాబోతున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయన పాలనకు మంచి మార్కులు పడటం వల్లే పంజాబ్ లో కూడా ప్రజలు ఆప్ కి పట్టం కట్టారు. వివిధ రాష్ట్రాలకు రాబోతున్న ఎన్నికలతో పాటు, 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా సత్తా చూపించాలంటే ఇప్పటినుంచే కష్టపడాలనేది కేజ్రీవాల్ ఆలోచన. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ను మార్చుకోవాలంటే కచ్చితంగా పాలన మారాలన్నారాయన. సుపరిపాలన సాధనకు ఆయన ఐదు మార్గదర్శకాలు ప్రతిపాదించారు. దీనిని కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్రజామద్దతు కూడగడతానంటున్న కేజ్రీవాల్.. సార్వత్రిక ఎన్నికలలోగా దేశం మొత్తం చుట్టేయాలనుకుంటున్నారు.

కేజ్రీవాల్ పంచ సూత్రాలు ఏంటంటే..

1. ప్రతి పిల్లవాడికి నాణ్యమైన ఉచిత విద్య, దీనికోసం విస్తృతంగా ప్రభుత్వ పాఠశాలల ప్రారంభం.

2. ప్రతి పౌరుడికీ ఉచిత నాణ్యమైన వైద్యం, చికిత్సతోపాటు ఉచితంగా మందుల సరఫరా.

3. నిరుద్యోగం అనే మాట లేకుండా చదువు అయిపోగానే యువతకు ఉద్యోగాలు

4. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు, సమాజంలో గౌరవమైన, సురక్షితమైన జీవితాన్ని గడిపే అవకాశం.

5. గిట్టుబాటు ధరల హామీతో రైతులకు ధీమా. సాగు విస్తీర్ణం తగ్గకుండా, రైతులు వ్యవసాయాన్ని వదిలేయకుండా చర్యలు..

గతంలో మోదీ చెప్పినట్టు నల్లడబ్బు వెలికి తీస్తాం, ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇస్తాం, రైతు ఆదాయం రెట్టింపుచేస్తామనే.. పెద్ద పెద్ద హామీలేవీ ఇందులో లేవు. విద్య, వైద్యం ఉచితం, ఉద్యోగాలు, మహిళలకు హక్కులు, రైతులకు భరోసా.. ఇలాంటి చిన్న చిన్న హామీలే ఉన్నాయి. ఇవి కూడా సాధించలేని ప్రభుత్వాలు ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నాయని, మరోసారి వారికి అవకాశమిస్తే గడచిన 75 ఏళ్లలాగే భారత్ ఉంటుందని పురోగమించలేదని అంటున్నారు కేజ్రీవాల్.

జోడో యాత్రకు పోటీగానా..?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో త్వరలో దేశవ్యాప్త పర్యటన మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా యాత్ర అంటూ పోటీగా వస్తున్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికిప్పుడు ఐకమత్యంగా లేకపోయినా.. విడివిడిగా అయినా బలపడాలనే ఉద్దేశంలో ఉన్నాయి. అప్పుడే బీజేపీని గద్దెదింపే అవకాశముంటుందని భావిస్తున్నాయి. అందుకే మోదీ టార్గెట్ గా ఈ యాత్రలు మొదలవుతున్నాయి.

First Published:  18 Aug 2022 2:41 AM GMT
Next Story