Telugu Global
National

ప్రేమ విఫలమై పిచ్చోడై..మూడేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు యువకుడు..!

కాలేజీ రోజుల్లో ముత్తు ఒక యువతిని ఇష్టపడినా ఆమె కూడా తిరస్కరించింది. ఆ తర్వాత రెండో సారి కూడా తాను ఎంతగానో ప్రేమించిన యువతి తిరస్కరించడంతో ముత్తుకు మతిభ్రమించింది.

ప్రేమ విఫలమై పిచ్చోడై..మూడేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు యువకుడు..!
X

ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకమే. అయితే అది కొందరికి తీపి జ్ఞాపకాలు, మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగుల్చుతుంది. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నారంటూ తరచూ మనం వార్తలు చదువుతుంటాం. అయితే ప్రేమ విఫలమై ఓ యువకుడు పిచ్చివాడిగా మారిన ఉదంతం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. గాఢంగా ప్రేమించిన యువతి తిరస్కరించడంతో మతిభ్రమించిన యువకుడు ఎటో వెళ్ళిపోయి మూడున్నర సంవత్సరాలు కన్నవారికి వేదన మిగిల్చాడు. పిచ్చివాడై తిరుగుతున్న ఆ వ్యక్తిని సమీప బంధువు గుర్తించి తిరిగి అతడి తల్లిదండ్రుల చెంతకు చేరాడు.

తెన్ కాశీ జిల్లా తెన్నమలైకి చెందిన ముత్తు మద్రాస్ వర్సిటీలో ఎంబీఏ చేశాడు. చెన్నైలోని ఒక ప్రైవేటు కార్యాలయంలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తూ అక్కడే ఒక హాస్టల్లో ఉండేవాడు. అలాగే ఐఏఎస్ కి కూడా ప్రిపేర్ అయ్యేవాడు. తను పనిచేసే ఆఫీసులో ఒక యువతిని ముత్తు ప్రేమించాడు. అయితే మొదట్లో ఆ యువతి ముత్తుతో సన్నిహితంగా మెలిగినప్పటికీ ఆ తర్వాత ముత్తు ప్రేమను తిరస్కరించింది.

కాలేజీ రోజుల్లో ముత్తు ఒక యువతిని ఇష్టపడినా ఆమె కూడా తిరస్కరించింది. ఆ తర్వాత రెండో సారి కూడా తాను ఎంతగానో ప్రేమించిన యువతి తిరస్కరించడంతో ముత్తుకు మతిభ్రమించింది. 2018 నవంబర్ 13న ముత్తు ఉన్నట్టుండి తాను ఉంటున్న హాస్టల్ నుండి మాయమయ్యాడు. అతడి కోసం కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ప్రేమ విఫలమై పిచ్చివాడిగా మారిన ముత్తు ఊర్లను పట్టుకుని తిరుగుతూ బిచ్చమెత్తుకుంటూ కన్యాకుమారికి చేరుకున్నాడు.

చాలా రోజులుగా అక్కడి రైల్వేస్టేషన్ ప్లాట్ ఫారంపై ఉంటున్నాడు. ప్రయాణికులు పెట్టే ఆహార పదార్థాలు తింటూ బతికేవాడు. ప్లాట్ ఫారంపైన ముత్తు ఇంగ్లీష్ పేపర్ చేతిలో పెట్టుకొని బిగ్గరగా చదువుతుండేవాడు. అతడిని చూసిన వారు పాపం..బాగా చదువుకున్న వ్యక్తి పిచ్చివాడు అయ్యాడు..అంటూ అతని పట్ల సానుభూతి చూపించేవారు.

ఇదిలా ఉండగా ఆదివారం తెన్నమలైకి చెందిన మురుగన్ కుటుంబంతో కలసి విహారయాత్ర కోసం కన్యాకుమారికి వచ్చాడు. అతడికి రైల్వే ప్లాట్ ఫారంపై భిక్షం ఎత్తుకుంటున్న ఒక వ్యక్తి తారసపడగా అతడిని ఎక్కడో చూసినట్లు అనిపించింది. జడలు జడలుగా పెరిగి ముడిపడిన జుట్టు, మాసిపోయి గుబురుగా పెరిగిన గడ్డం, ఒంటిపై సరిగా దుస్తులు కూడా లేని వ్యక్తిని తదేకంగా పరిశీలించగా అతడు కొన్నేళ్ళ కిందట చెన్నైలో మాయమైన ముత్తుగా గుర్తించాడు. అతడితో మురుగన్ మాట కలిపినా అతడు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏ ఊరు మీది అంటూ మురుగన్ గుచ్చిగుచ్చి అడగడంతో తనది తెన్నమలై అని అతడు చెప్పాడు.

అతడు ముత్తు అని నిర్ధారించుకున్న మురుగన్ స్థానిక పోలీసులను కలిసి సాయం కోరాడు. ఆ తర్వాత పోలీసుల సాయంతో మురుగన్ అతడిని ఒక సెలూన్ కి తీసుకెళ్లి ఏపుగా పెరిగిన జుట్టు, గడ్డం కత్తిరించి గుండు కొట్టించారు. అతడికి స్నానం చేయించి కొత్త దుస్తులు వేయించారు. ఆ తర్వాత మురుగన్ విషయాన్ని ముత్తు తల్లిదండ్రులకు తెలిపాడు.

ముత్తు తల్లిదండ్రులు, అతడి ముగ్గురు సోదరులు, ముగ్గురు చెల్లెలు వెంటనే కన్యాకుమారికి చేరుకున్నారు. సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత ముత్తును చూసిన వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ తర్వాత వారు ముత్తుకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు అందజేసి అతడిని తమవెంట తీసుకెళ్లారు. ప్రేమ విఫలమై మూడున్నర సంవత్సరాల పాటు పిచ్చివాడిలా తిరిగిన ముత్తు ఎట్టకేలకు కుటుంబం చెంతకు చేరాడు.

First Published:  19 July 2022 8:15 AM GMT
Next Story