Telugu Global
National

లైంగిక వేధింపులకు గురైన మహిళా కోచ్ దేశం విడిచి వెళ్తే నెలకు కోటి రూపాయలు ఇస్తారట‌!

బాధితురాలిపై తీవ్ర వత్తిడి తెస్తున్నారు. బెధిరింపులకు పాల్పడుతున్నారు. తనకు నెలకు కోటి రూపాయలు ఇస్తామని, దేశం విడిచి వెళ్ళాలని ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆ మహిళా కోచ్ ఆరోపించారు. హర్యాణా పోలీసులు కూడా తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆందోళన వెలిబుచ్చారు.

లైంగిక వేధింపులకు గురైన మహిళా కోచ్ దేశం విడిచి వెళ్తే నెలకు కోటి రూపాయలు ఇస్తారట‌!
X

ఓ మహిళా కోచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన హర్యాణాక్రీడా శాఖా మంత్రి, బీజేపీ నాయకుడు సందీప్ సింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కూడా మంత్రికే మద్దతు పలకడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనేక నెలల పాటు మహిళను లైంగికంగా వేధించిన మంత్రిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు అనుమానాలు వస్తున్నాయి.

మరో వైపు బాధితురాలిపై తీవ్ర వత్తిడి తెస్తున్నారు. బెధిరింపులకు పాల్పడుతున్నారు. తనకు నెలకు కోటి రూపాయలు ఇస్తామని, దేశం విడిచి వెళ్ళాలని ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆ మహిళా కోచ్ ఆరోపించారు. హర్యాణా పోలీసులు కూడా తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆందోళన వెలిబుచ్చారు.

చండీగఢ్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరైన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"నేను చండీగఢ్ పోలీస్ సిట్‌కి అన్నీ వివరంగా చెప్పాను. ఈ ఉదయం ముఖ్యమంత్రి ప్రకటనను నేను విన్నాను, అందులో ముఖ్యమంత్రి స్వయంగా సందీప్ సింగ్ పక్షం వహిస్తున్నారు. చండీగఢ్ పోలీసులు నాపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. హర్యానా పోలీసులు మాత్రం నాపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు.' అని ఆమె ఆరోపించారు.

"నన్ను దేశం విడిచి వేరే ఏ దేశమైనా వెళ్ళాలని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అలా చేస్తే నెలకు 1 కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు'' అని ఆమె మీడియాకు చెప్పింది.

చండీగఢ్ పోలీసులు ఇప్పటి వరకు లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రిని అరెస్టు చేయలేదని, కనీసం ఆయనను విచారించలేదని కోచ్ తరపు న్యాయవాది దీపాంశు బన్సాల్ ఆరోపించారు.

"చండీగఢ్ పోలీసులు సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చారు, ఆ తర్వాత మేము స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నాము. 8 గంటల పాటు విచారణ జరిగింది. నా క్లయింట్ వద్ద ఉన్న రికార్డులను పోలీసుల ముందు సమర్పించాము. తన ఫోన్‌ను కూడా పోలీసులకు సమర్పించాం. పోలీసులు సందీప్ సింగ్‌ను విచారించలేదు, అరెస్టు చేయలేదు. సందీప్ సింగ్‌ను విచారించే విషయమై సిట్ ఇన్‌ఛార్జ్‌తో మాట్లాడాం. మంత్రిని అరెస్టు చేసేందుకు పోలీసులకు రెండు మూడు రోజుల సమయం ఇచ్చాం'' అని చెప్పారు.

"సందీప్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించారు, అయిన‌ప్పటికీ పోలీసులు అతన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు? బాధితురాలి ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు'' అని న్యాయవాది తెలిపారు.

అంతకుముందు, బాధితురాలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది, ఇందులో మంత్రి తనను గత ఏడాది ఫిబ్రవరి నుండి నవంబర్ వరకు పదేపదే మెసేజ్ ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వేధించారని ఆరోపించారు. తనను అనేక సార్లు తాకరాని చోట్ల తాకడమే కాక బెదిరించాడని ఆమె తెలిపారు.

"నేను కూడా ఒక మనిషినే, ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు ఆ వ్యక్తి చెడు ప్రవర్తనను నేను ఎంత ఓపికగా సహించానో ఆలోచించండి" అని ఆమె ప్రశ్నించింది. చాలా కాలం భయపడి ఈ విషయాలను బైటపెట్టలేదని ఇక ఓపిక నశించిందని ఆమె అన్నారు.

అయితే మహిళా కోచ్ పై బీజేపీ మంత్రి లైంగిక వేదింపులకు పాల్పడిన కేసును పక్కదోవపట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. హర్యాణా ప్రభుత్వ తప్పని సరి పరిస్థితుల్లో క్రీడా మంత్రిని పదవి నుండి తొలగించినప్పటికీ స్వయంగా ముఖ్యమంతే ఆయనకు మద్దతుగా బహిరంగంగా మాట్లాడటం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేసు చండీగడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ వారు కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది.

First Published:  4 Jan 2023 6:01 AM GMT
Next Story