Telugu Global
National

వ‌చ్చే ఎన్నికల్లో భర్తపై పోటీకి సై అంటున్న భార్య

అన్నదమ్ములు, తోబుట్టువులు ఒకరిపై మరొకరు పోటీ చేయ‌డం ఏళ్ల నుంచి చూస్తున్నాం కానీ.. భర్తపై భార్య పోటీ చేసిన దాఖలాలు పెద్దగా లేవు.

వ‌చ్చే ఎన్నికల్లో భర్తపై పోటీకి సై అంటున్న భార్య
X

వ‌చ్చే ఎన్నికల్లో భర్తపై పోటీకి సై అంటున్న భార్య

ఎన్నికలొస్తే చాలు చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, తండ్రీబిడ్డలు.. ఇలా ఒకరిపై మరొకరు పోటీకి దిగుతూ ఆసక్తి రేపుతుంటారు. అన్నదమ్ములు, తోబుట్టువులు ఒకరిపై మరొకరు పోటీ చేయ‌డం ఏళ్ల నుంచి చూస్తున్నాం కానీ.. భర్తపై భార్య పోటీ చేసిన దాఖలాలు పెద్దగా లేవు. అయితే రాజస్థాన్‌లో ఇటువంటి ఆసక్తికర పోటీ జరగబోతోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లో కూడా ప్రస్తుతం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకొని టికెట్లు కేటాయిస్తున్నాయి. కాగా, ఆ రాష్ట్రంలోని దంతరామ్‌గర్ నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వీరేంద్ర సింగ్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఇచ్చింది.

అయితే వీరేంద్ర తన భార్య రీటా చౌదరికి కూడా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ కేటాయించాలని పార్టీ నేతలను కోరగా ఇందుకు వారు సమ్మతించలేదు. దీంతో రీటా చౌదరి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జేజేపీలో చేరారు. తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న దంతరామ్ గర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు జేజేపీ కూడా సమ్మతించింది.

తన మనస్సాక్షి చెప్పిన విధంగానే నడుచుకుంటానని, అందుకే జేజేపీలో చేరినట్లు రీటా చౌదరి తెలిపారు. భర్తపై పోటీ చేయాలన్న తన నిర్ణయాన్ని ప్రజలు కూడా ఆమోదించారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో తానే విజయం సాధిస్తానని రీటా చౌదరి ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. రాజస్థాన్ లోని అల్వార్ రామ్‌గర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మహిళా నాయకురాలు షఫియా జుబైర్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా ఆమె అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తి చూప‌గా.. కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. ఆసక్తికరంగా సిట్టింగ్ ఎమ్మెల్యే భర్త, మాజీ ఎమ్మెల్యే అయిన జుబీర్ ఖాన్ కు టికెట్ కేటాయించింది. దీనిపై షఫియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనకు కాకుండా తన భర్తకి టికెట్ కేటాయించినందుకు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు.

First Published:  25 Oct 2023 5:56 AM GMT
Next Story