Telugu Global
National

తాజ్ మహల్ ముందు నమాజు చేయొచ్చా..? వైరల్ వీడియోపై విచారణ

తాజ్ మహల్ ఆవరణలో ఓ వ్యక్తి నమాజు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. విచారణకు ఆదేశించింది.

తాజ్ మహల్ ముందు నమాజు చేయొచ్చా..? వైరల్ వీడియోపై విచారణ
X

తాజ్ మహల్ ముందు నమాజు చేయొచ్చా..? గతంలో ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేశారా, అసలు తాజ్ మహల్ లో కానీ, ఆ ఆవరణలో కానీ నమాజు చేయడంపై ఆంక్షలున్నాయా..? ఇప్పుడీ వ్యవహారం తీవ్రంగా చర్చకు వచ్చింది. తాజాగా తాజ్ మహల్ ఆవరణలో ఓ వ్యక్తి నమాజు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది.

నమాజు కి అనుమతి లేదు..

ఆదివారం ఓ వ్యక్తి తాజ్ మహల్ ఆవరణలో నమాజు చేసినట్టు ఓ వీడియో బయటకొచ్చింది, ఆ సమ‌యంలో ఆయన పక్కన మరో మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి తాజ్ మహల్ ఆవరణలో నమాజు చేయడానికి అనుమతి లేదు. ప్రతి శుక్రవారం, అది కూడా తాజ్ మహల్ పక్కన ఉన్న ఓ మసీదు దగ్గర మాత్రమే నమాజు చేసుకోవచ్చు. తాజ్ మహల్ చుట్టుపక్కల ఉన్న కొద్దిమందికి మాత్రమే నమాజ్ కోసం పాస్ లు ఇస్తారు. వారు మాత్రమే ఆరోజు అక్కడ నమాజు చేస్తారు. మిగతా సమయాల్లో తాజ్ మహల్ ఆవర‌ణలో నమాజు చేయడం నిషిద్ధం. ఆగ్రా సర్కిల్ ఆర్కియాలజీ విభాగం సూపరింటెండెంట్ రాజ్ కుమార్ పటేల్ దీనిపై వివరణ ఇచ్చారు. నిషిద్ధ ప్రాంతంలో నమాజు ఎవరూ చేయరని, తమ సిబ్బంది కూడా అలాంటి వారిని చూడలేదన చెప్పారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామంటున్నారు.

మండిపడుతున్న హిందూ సంఘాలు..

తాజ్ మహల్ లో నమాజుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని, లేదా తమకు కూడా తాజ్ మహల్ లో పూజలు చేసుకోవ‌డానికి అనుమతివ్వాలని అంటున్నారు. అసలు దానిపేరు తాజ్ మహల్ కాదని, తేజో మహాలయ అనే శివుడి గుడి అని వాదిస్తున్నారు స్థానిక హిందూ సంఘం నేతలు. నమాజు వీడియో వ్యవహారాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు, విచారణ చేపట్టారు.

First Published:  23 Nov 2022 3:53 AM GMT
Next Story