Telugu Global
National

విపక్షాల ఐక్యతకు పరీక్ష

పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించేట్టయితే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని ఇప్పటికే బిజెపియేతర పక్షాలైన 19 పార్టీలు తేల్చిచెప్పాయి.

విపక్షాల ఐక్యతకు పరీక్ష
X

సకల ప్రజాస్వామ్య సంప్రదాయాలను పక్కన పెట్టి పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధపడ్డారు. మూడోసారి ప్రధాని కావాలన్న తన ఆకాంక్షలని నెరవేర్చుకోవ‌డానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నదే మోదీ ఎత్తుగడ. తన ఇమేజ్‌ని పెంచుకోడానికి పార్లమెంటు కొత్త భవన ప్రారంభ సందర్భాన్ని వదులుకోదలుచుకోలేదు. దేశంలో ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పార్లమెంటు భవన ప్రారంభం సముచితమైన చర్య. ప్రజాస్వామ్య సంప్రదాయాల సమున్నతకు తగిన విధానం. కానీ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించే కాషాయ ప్రభుత్వం అన్నిరకాల సంప్రదాయాలను త్రోసి రాజంటున్నది.

ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్న విపక్షాల కోర్కెను సుప్రీంకోర్టు సైతం నిరాకరించింది. పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీకి బదులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రారంభింపజేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల (పిల్‌) )పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.


పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించేట్టయితే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని ఇప్పటికే బిజెపియేతర పక్షాలైన 19 పార్టీలు తేల్చిచెప్పాయి. పార్లమెంటు భవన ప్రారంభోత్సవ సందర్భం ఒకవిధంగా ఎవరు ఎటు వైపు ఉన్నారనే దానిని స్పష్టం చేస్తున్నది. బిజెపిని గద్దెదింపడం కోసం ప్రతిపక్షాలన్నిటినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్‌తో సహా కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్నాళ్ళుగా బలంగా ప్రయత్నిస్తున్నాయి. బిజెపి విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తూనే ఆ పార్టీ బి-టీంలుగా వ్యవహరిస్తున్న పార్టీలూ ఉన్నాయి.

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ సన్నివేశం ఈ శషభిషలకు తెరదించే సందర్భాన్ని కల్పించింది. బిజెపియేతర పక్షాలలో ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజెడి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైసిపి, ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి, కర్నాటకలోని దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్‌ పార్లమెంటు భవన ప్రారంభానికి హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

బిజెపి, కాంగ్రెస్‌లకు సమాన దూరం అనే వైఖరితో ఉన్న ఆప్‌, తృణమూల్‌, సమాజ్‌వాదీ పార్టీలు మాత్రం పార్లమెంటు భవన ప్రారంభానికి హాజరు కారాదన్న విపక్షాలతో గొంతు కలిపాయి. ఇదే సమయంలో ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వ అధికారాలను కత్తిరిస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ బిల్లుగా ఆమోదం పొందకుండా వుండటం కోసం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ సహకారం కోరుతున్నారు. బిజెపియేతర పక్షాలన్నీ ఐక్యంగా నిలిస్తే ఆ ఆర్డినెన్స్‌ బిల్లుగా రూపొందకుండా వీగిపోతుందని కేజ్రీవాల్‌ ఆశిస్తున్నారు. అయితే ఆయనకు మద్దతు ఇచ్చే విషయమై ఎటూ తేల్చిచెప్పలేని స్థితిలో వున్న కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కేజ్రీవాల్‌ను సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే మున్ముందు బిజెపి వ్యతిరేక పోరాటానికి ఆయన కలిసి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆయనకు మద్దతు ఇస్తే ఢిల్లీలో ఆప్‌ బలపడటానికి తాము కూడా తోడ్పడిన వారమవుతామనే సందిగ్ధంలో కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతున్నది.

First Published:  26 May 2023 11:50 AM GMT
Next Story