Telugu Global
National

ప్రజలకు కష్టాలు - ప్రధానికి ర్యాంకులు.. సర్వేలతో ఎన్నాళ్లీ కనికట్టు..?

సోషల్ మీడియా ప్రచారాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం మోదీ నెంబర్ 1 కావొచ్చు. ప్రజాభిప్రాయం తీసుకుంటే మాత్రం మోదీ ఏ స్థానంలో ఉంటారో తేలాల్సి ఉంది.

ప్రజలకు కష్టాలు - ప్రధానికి ర్యాంకులు.. సర్వేలతో ఎన్నాళ్లీ కనికట్టు..?
X

పెట్రోల్ రేట్ లో భారత్ నెంబర్ 1

గ్యాస్ సిలిండర్ బాదుడులో నెంబర్ 1

నిరుద్యోగంలో నెంబర్ 1

రేపిస్ట్ లకు క్షమాభిక్ష పెట్టడంలో నెంబర్ 1

ఆఖరికి ఆర్థిక రంగంలో బంగ్లాదేశ్ తో కూడా పోటీ పడలేకపోతున్నామని ఇటీవల సర్వేలు చెబుతున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే.. ప్రపంచ దేశాల్లో మన ప్రధాని మోదీ నెంబర్-1 కావడమే. దేశంలో ప్రధాని తోపు అంటూ సర్వే ఫలితాలు వస్తే దాన్ని ఎవరైనా ఆసక్తిగా చూస్తారేమో.. కానీ ఇప్పుడు బయటకొచ్చిన సర్వే మోదీని లోకనాయకుడిగా కీర్తించడమే వింత, విడ్డూరంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 22మంది దేశాధినేతల్లో మోదీ నెంబర్-1 ర్యాంక్ సంపాదించారట. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని సైతం వెనక్కు నెట్టారట. బైడెన్ కి కేవంల 41 మార్కులు వస్తే, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏకంగా 70శాతం మార్కులు వచ్చాయని సదరు సంస్థ ప్రకటించింది. కెనడా, ఇటలీ, జపాన్.. ఇలా ఏ దేశ ప్రధాని అయినా మోదీ తర్వాతేనంటోంది ఆ సంస్థ.

ర్యాంకులిచ్చిన సంస్థల నిజాయితీని శంకించడంలేదు కానీ, అసలు ఏ ప్రాతిపదికన మోదీని లోకనాయకుడిగా కీర్తించిందో అర్థం కావడంలేదు. సోషల్ మీడియా ప్రచారాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం మోదీ నెంబర్ 1 కావొచ్చు. ప్రజాభిప్రాయం తీసుకుంటే మాత్రం మోదీ ఏ స్థానంలో ఉంటారో తేలాల్సి ఉంది.

సర్వేలతో కొంప మునుగుతుందా..?

భారత్ వెలిగిపోతోందంటూ ఆనాడు బీజేపీ చేసిన ప్రచారమే ఆ పార్టీని ముంచేసిందని అందరికీ తెలుసు. ఇప్పుడు భారత ప్రధాని దేదీప్యమానంగా వెలిగిపోతున్నారంటూ చంకలు గుద్దుకుంటోంది పార్టీ. మరి ఈ అతివిశ్వాసం దేనికి దారితీస్తుందో తేలాల్సి ఉంది. ఓవైపు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిస్సిగ్గుగా ఎమ్మెల్యేల బేరసారాలు సాగిస్తోంది బీజేపీ. హనీట్రాప్ ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారం కోసం దేనికైనా సిద్ధం అనేలా పావులు కదుపుతోంది కాషాయదళం. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేవలం ప్రధాని, అదానీ లాంటి వాళ్లకు మాత్రమే ఇవి మంచిరోజులని, పేద, మధ్యతరగతి ప్రజలందరికీ ఇది కష్టకాలమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వేల అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచుతుందని అంటున్నారు.

First Published:  27 Aug 2022 3:53 AM GMT
Next Story