Telugu Global
National

17 రాష్ట్రాలకు విస్తరించిన కోవిడ్‌

ఇప్పటివరకు అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్‌లో 12 మంది కరోనా బారిన పడ్డారు.

17 రాష్ట్రాలకు విస్తరించిన కోవిడ్‌
X

వైద్య నిపుణులు చెప్పినట్టుగానే కోవిడ్‌ కొత్త వేరియంట్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. తొలుత కేరళలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1.. ఇప్పుడు దేశంలోని 17 రాష్ట్రాలకు విస్తరించింది. అతి తక్కువ రోజుల్లోనే ఇది విస్తృతంగా వ్యాపించడం గమనార్హం. దేశంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 3 వేలు దాటేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కరోనా వైరస్‌ కేసులపై కేంద్రం శనివారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఒకేరోజు 423 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,420కి చేరింది. మొత్తం 17 రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కేసులు నమోదైన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉండటం గమనార్హం.

ఇప్పటివరకు అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్‌లో 12 మంది కరోనా బారిన పడ్డారు. ఇక తెలంగాణలో 9, ఏపీలో 8 కేసులు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటక, రాజస్థాన్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌ బారినపడి మృతిచెందారు.



కొత్త వేరియంట్‌ వ్యాప్తి శరవేగంగా ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత.. పలు రాష్ట్రాలు కూడా జేఎన్‌.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రత్యేక వార్డులు, బెడ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. రోజువారీగా పరీక్షలు కొనసాగిస్తూ.. కేసుల వివరాలను కేంద్రానికి ఎప్పటికప్పుడు అందజేస్తున్నాయి.

First Published:  23 Dec 2023 10:13 AM GMT
Next Story