Telugu Global
National

ఇంట్లోకి దూరి గర్భిణి సహా ముగ్గురు దళితులను కాల్చి చంపిన కులోన్మాదులు

హరిలాల్ పాసీ, కూతురు బ్రిజ్‌కాళీ పాసీ (22), అల్లుడు శివ్‌సాగర్ పాసి (26) తమ గుడిసెలో నిద్రిస్తుండగా గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఎనిమిది మంది ఇంట్లోకి చొరబడ్డారు. వారి ముగ్గురినీ తుపాకులతో కాల్చి వేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

ఇంట్లోకి దూరి గర్భిణి సహా ముగ్గురు దళితులను కాల్చి చంపిన కులోన్మాదులు
X

ఒక దళితుడి భూమిపై కన్నేసిన ఇతర కులాలకు చెందిన వ్యక్తులు అతడిని ముప్పతిప్పలు పెట్టారు. నచ్చజెప్పో, భయపెట్టో ఆ భూమిని కాజేయాలని చూశారు. ఆ భూమిని ఎక్కడ కబ్జా చేస్తారో అని ఆ దళితుడు అక్కడే ఒక గుడిసె వేసుకొని నివసిస్తున్నాడు. ఇది చూసి తట్టుకోలేకపోయిన కులోన్మాదులు.. అతని ఇంట్లోకి దూరి తుపాకీతో కాల్చి చంపారు. అదే ఇంట్లో ఉన్న గర్భవతైన కూతురు, అల్లుడిని కూడా పొట్టన పెట్టుకున్నారు. యూపీలోని కుషాంబి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకున్నది. పోలీసులు చెప్పిన వివరాల మేరకు..

కుషాంబి జిల్లాలోని మొహియుద్దీన్ పూర్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల హరిలాల్ పాసీ, కూతురు బ్రిజ్‌కాళీ పాసీ (22), అల్లుడు శివ్‌సాగర్ పాసి (26) తమ గుడిసెలో నిద్రిస్తుండగా గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఎనిమిది మంది ఇంట్లోకి చొరబడ్డారు. వారి ముగ్గురినీ తుపాకులతో కాల్చి వేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు హరిలాల్‌కు కొంత మందితో భూతగాదాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ముగ్గురి హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

ఈ హత్యకు పాల్పడిన వారిలో అమర్ సింగ్, అమిత్ సింగ్ అనే ఇద్దరు మృతుడు హరిలాల్ పొరుగునే ఉంటారని.. ఈ హత్యాకాండలో ప్రధాన నిందితులు వారిద్దరే అని కుషాంబి జిల్లా సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ్ చెప్పారు. వీరిద్దరితో పాటు హత్యలో పాల్గొన్న 8 మందిపై ఐపీసీ 302, 147, 148, 149 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులందరూ యాదవ, లోనియా చైహాన్ సామాజిక వర్గానికి చెందిన వారిగా పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితులు అందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. భూ వివాదాల నేపథ్యంలో ఈ హత్యలు చోటు చేసుకున్నాయని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు.

చనిపోయిన హరిలాల్ కుమారుడు సుభాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు విషయాలు పేర్కొన్నాడు. గ్రామంలోని పాండా క్రాసింగ్‌కు సమీపంలో హరిలాల్‌కు కొంత భూమి ఉంది. అయితే స్థానికుడైన దశరథ్ ఆ భూమిపై కన్నేశాడు. ఎలాగైనా ఆ భూమిని చేజిక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశాడు. దీంతో హరిలాల్ భూమిని కాపాడుకోవడానికి అక్కడే ఒక గుడిసె వేసుకొని కుమార్తె, అల్లుడితో కలిసి ఉంటున్నాడు.

తాను కన్నేసిన భూమిలోనే గుడిసె వేసుకొని ఉండటంతో రగిలిపోయిన దశరథ్ ఎలాగైనా తన తండ్రిని అంతం చేయాలని స్కెచ్ చేసినట్లు సుభాష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే దశరథ్ తన మనుషులను పురమాయించి ఈ హత్యాకాండకు పాల్పడినట్లు తెలిపాడు. కాగా, రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటు వల్లే ఈ భూతగాదా ఏర్పడిందని.. సదరు భూమి హరిలాల్‌దే అని గ్రామస్థులు చెబుతున్నారు. హరిలాల్ సహా ముగ్గురిని హత్య చేసిన విషయం తెలియగానే గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హరిలాల్ బంధువుల కొంత మంది వెళ్లి హత్యకు పాల్పడిన వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో రెండు ఇళ్లు కాలిపోయినట్లు ఎస్పీ శ్రీవాస్తవ తెలిపారు.




First Published:  16 Sep 2023 4:18 AM GMT
Next Story