Telugu Global
National

భారతీయ‌ మీడియాలో నాయకత్వ స్థానాల్లో 88% అగ్రకులాల వారే : రిపోర్ట్

భారత దేశ మీడియా అగ్రకులాల చేతుల్లో ఉందని ఓ అధ్యయనం తెలిపింది. మీడియాలోని నాయకత్వ స్థానాల్లో 88 శాతం అగ్రకులాల వారే ఉన్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది.

భారతీయ‌ మీడియాలో నాయకత్వ స్థానాల్లో  88% అగ్రకులాల వారే : రిపోర్ట్
X

భారత దేశంలోని రాజకీయాల్లో, ఉన్నత ఉద్యోగాల్లో, అన్ని సంస్థల నాయకత్వ స్థానాల్లో...ఇంకా చెప్పాలంటే అన్నిముఖ్యమైన రంగాల‌ నాయకత్వాన్ని ఎలాగైతే అగ్రకులాలు ఆక్రమించాయో అదే విధంగా మీడియా కూడా భిన్నంగా ఏమీ లేదని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది.

ప్రింట్, టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా భారతీయ మీడియాలోని అగ్ర నాయకత్వ స్థానాల్లో 88% అగ్రకులాల వారే ఉన్నారని 2021-2022 నివేదిక తేల్చింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2018-19లో కూడా అదే పరిస్థితి ఉంది.

2021 ఏప్రిల్, 2022 మధ్యకాలంలో ఆక్స్‌ఫామ్ ఇండియా, న్యూస్‌లాండ్రీ ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. ఈ అధ్యయనం వివిధ కులాలకు చెందిన వ్యక్తుల ప్రాతినిధ్యాన్ని విశ్లేషించడానికి 'బైలైన్ కౌంట్' పద్ధతిని ఉపయోగించింది.

ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియా అవుట్‌లెట్‌లలో సర్వే చేసి, 218 సంస్థ‌ల్లోని నాయకత్వ స్థానాల్లో 191 స్థానాలు (88%) అగ్రకులానికి చెందిన వ్యక్తులు ఆక్రమించారని నివేదిక పేర్కొంది.

"ప్రధాన స్రవంతి మీడియా సంస్థల్లో వేటిలో కూడా నాయకత్వ స్థానాల్లో SC/ST వర్గాలకు చెందిన వ్యక్తులు లేరు. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మాత్రం రెండు ప్రత్యామ్నాయ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నాయకత్వ స్థానాల్లో ఉన్నారు" అని నివేదిక పేర్కొంది.

2018-19లో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. 121 మీడియా సంస్థల‌ నాయకత్వ స్థానాలలో, 106 (88%) మంది అగ్ర కులాలకు చెందిన జర్నలిస్టులు ఆక్రమించారు.

యాంకర్లు, రైటర్స్ లలో కూడా అగ్ర కులాలకు చెందిన వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారని నివేదిక తెలిపింది.

ప్రింట్ మీడియా

ప్రింట్ మీడియాలో, ఇంగ్లీష్, హిందీ వార్తాపత్రికలలో 60% కంటే ఎక్కువ బైలైన్ కథనాలు అగ్రకులాల వ్యక్తులు రాశారు. 5% కంటే తక్కువ వ్యాసాలు షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులు రాశారు. 10% ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు రాశారు.

.

దాదాపు అన్ని పత్రికల్లోనూ సగానికి పైగా వ్యాసాలు అగ్రకుల‌ జర్నలిస్టులే రాశారు. "ఏ ఒక్క పత్రికలో కూడా 10% కంటే ఎక్కువ SC ప్రాతినిధ్యం లేదు. ST వర్గాలకు చెందిన వ్యక్తుల సంఖ్య సున్నా లేదా అతి తక్కువ ఉనికిని కలిగి ఉంది."

హిందీ పత్రికల విషయంలోనూ ఇదే పరిస్థితి. "OBC జర్నలిస్టులకు కొద్దిపాటి ప్రాతినిధ్యం మాత్రమే ఉంది, తరువాత SC , ST జర్నలిస్టులు కేవలం 0-6% మాత్రమే ఉన్నారు" అని రిపోర్ట్ పేర్కొంది.

టెలివిజన్

55.6% ఇంగ్లీష్ న్యూస్ యాంకర్లు అగ్ర కులాల వారు కాగా, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యాంకర్లు అసలు లేరు. ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్‌లలో OBC కమ్యూనిటీకి చెందిన యాంకర్‌ల ప్రాతినిధ్యం 11.1% ఉంది.

అధ్యయనం చేసిన ఏడు ఛానళ్లలో, నాలుగింటిలో ఓబీసీ కమ్యూనిటీకి చెందిన ఒక్క‌ యాంకర్ కూడా లేరని నివేదిక పేర్కొంది.

డిబేట్ లు, షోలలో తమ అభిప్రాయాలను తెలియజేయడానికి పిలిచే ప్యానలిస్టులలో కూడా అట్టడుగు వర్గాల ప్రజల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. "హిందీ, ఇంగ్లీష్ ప్రైమ్‌టైమ్ షోలలోని మొత్తం ప్యానెలిస్ట్‌లలో 60% కంటే ఎక్కువ మంది అగ్రకులాలకు చెందినవారు. హిందీ, ఇంగ్లీషు డిబేట్‌లలో 5% కంటే తక్కువ మంది ప్యానెలిస్ట్‌లు SC/ST వర్గాలకు చెందినవారు" అని నివేదిక తెలిపింది.

డిజిటల్ మీడియా

డిజిటల్ మీడియాలో, అగ్ర‌ కుల జర్నలిస్టులు 68.5% బైలైన్‌లతో న్యూస్‌లాండ్రీ ఇంగ్లీష్ అగ్రస్థానంలో ఉండగా, ఫస్ట్ పోస్ట్ 61%, స్క్రోల్ 54% తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ది వైర్ లో రాసిన అన్ని కథనాలలో సరిగ్గా సగం అగ్రకులానికి చెందిన పాత్రికేయులు, 12.4% OBC వర్గానికి చెందిన జర్నలిస్టులు, 3.2% SC వర్గాల నుండి, 0.6% ST వర్గాల వారు రాశారు.

ఎస్సీ కమ్యూనిటీకి చెందిన జర్నలిస్టులు అత్యధికంగా వ్యాసాలు రాసిన ఏకైక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ 'మూక్‌నాయక్' అని నివేదిక పేర్కొంది.,

First Published:  18 Oct 2022 2:08 AM GMT
Next Story