Telugu Global
National

80 ఏళ్ల‌ మాజీ ఉద్యోగిపై క‌రుణ చూపిన హైకోర్టు.. - శిక్ష‌ ఏడాది నుంచి ఒక‌రోజుకు కుదింపు

తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని, కూడిక‌ల‌లో జ‌రిగిన పొర‌పాటు వ‌ల్ల ఈ త‌ప్పు జ‌రిగింద‌ని హ‌నుమంత‌రావు వాదించారు. దీంతో ఈ వ్య‌వ‌హారంపై అధికారులు కోర్టులో కేసు వేశారు.

80 ఏళ్ల‌ మాజీ ఉద్యోగిపై క‌రుణ చూపిన హైకోర్టు.. - శిక్ష‌ ఏడాది నుంచి ఒక‌రోజుకు కుదింపు
X

ఆయ‌నో మాజీ ప్ర‌భుత్వ ఉద్యోగి.. వ‌య‌సు 80 ఏళ్లు.. విధి నిర్వ‌హ‌ణ‌లో నిధుల దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ అనంత‌రం కింది కోర్టు ఆయ‌న‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. దీంతో ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసులో విచార‌ణ అనంత‌రం సోమవారం నాడు క‌ర్నాట‌క హైకోర్టు ఆయ‌న శిక్ష‌ను ఏడాది నుంచి ఒక‌రోజుకు త‌గ్గిస్తూ తీర్పు చెప్పింది. అది కూడా ఒక‌రోజంతా న్యాయ‌స్థానంలోనే ఉండాల‌ని ఆదేశించింది. ఆయ‌న న్యాయ‌స్థానంలోనే ఉండ‌టంతో ఆయ‌న శిక్షాకాలం ముగిసింద‌ని కూడా కోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలిలా ఉన్నాయి.

ఆయ‌న పేరు హ‌నుమంత‌రావు. ప్ర‌భుత్వ ఉద్యోగి. విధుల్లో ఉన్న స‌మ‌యంలో అంటే 1981 న‌వంబ‌రు 21 నుంచి 1987 జ‌న‌వ‌రి 5 వ‌ర‌కు మంజూరు చేసిన వితంతువుల పింఛ‌నులో రూ.54,299 మేర‌కు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ న‌గదును 1987 జ‌న‌వ‌రి 31లోగా చెల్లించాల‌ని అధికారులు ఆదేశించారు.

అయితే తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని, కూడిక‌ల‌లో జ‌రిగిన పొర‌పాటు వ‌ల్ల ఈ త‌ప్పు జ‌రిగింద‌ని హ‌నుమంత‌రావు వాదించారు. దీంతో ఈ వ్య‌వ‌హారంపై అధికారులు కోర్టులో కేసు వేశారు. మండ్య జిల్లా కేఆర్ పేట న్యాయ‌స్థానం ఈ కేసులో విచార‌ణ కొన‌సాగించింది. సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం 2009 ఏప్రిల్ 8న ఏడాది జైలు శిక్ష, రూ.3 వేల జ‌రిమానా విధిస్తూ న్యాయ‌స్థానం తీర్పు చెప్పింది.

దీనిపై హ‌నుమంత‌రావు హైకోర్టును ఆశ్ర‌యించారు. తాను దుర్వినియోగం చేశాన‌ని చెబుతున్న న‌గ‌దును త‌న జీతం నుంచి 1987లోనే అధికారులు మిన‌హాయించుకున్నార‌ని విచార‌ణ‌లో భాగంగా వెల్ల‌డించారు. ఈ కేసులో వాద‌న‌లు ముగిసిన అనంత‌రం ఆయ‌న వ‌య‌సును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న న్యాయ‌స్థానం కింది కోర్టు విధించిన ఏడాది జైలు శిక్ష‌ను ఒక‌రోజుకు కుదించింది. అది కూడా శిక్ష‌లో భాగంగా న్యాయ‌స్థానంలో ఒక‌రోజు ఉంటే స‌రిపోతుంద‌ని చెప్పింది. ఈ నేప‌థ్యంలో అదేరోజు ఆయ‌న కోర్టు ప‌నివేళ‌లు ముగిసేవ‌ర‌కు న్యాయ‌స్థానంలోనే ఉన్నారు. దీంతో ఆయ‌న శిక్షాకాలం ముగిసింద‌ని న్యాయ‌స్థానం వెల్ల‌డించింది.

First Published:  25 April 2023 6:13 AM GMT
Next Story