Telugu Global
National

చోరీకి వచ్చి చంపేసిన కేసులో 8 మందికి మరణశిక్ష

పీలీభీత్‌లో రవికాంత్‌ మిశ్ర ఇన్‌కం ట్యాక్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. బరేలీలో నివాసం ఉంటున్న ఆయన 2014 ఏప్రిల్‌ 21న ఉదయం 9 గంటలకు విధుల నిమిత్తం పీలీభీత్‌ వెళ్లారు.

చోరీకి వచ్చి చంపేసిన కేసులో 8 మందికి మరణశిక్ష
X

చోరీకి వచ్చి.. ఇంట్లోని ముగ్గురిని నిర్దాక్షిణ్యంగా, అతి క్రూరంగా హతమార్చిన నిందితులకు మరణశిక్షే సరైనదని న్యాయస్థానం భావించింది. ఈ దారుణ మారణకాండలో పాల్గొన్న 8 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు.. దొంగల నుంచి బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యాపారికి యావజ్జీవ శిక్ష విధించింది.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో గల సురేశ్‌శర్మ నగర్‌లో పదేళ్ల కిందట ఈ దారుణ మారణకాండ జరిగింది. ఈ కేసును విచారించిన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ కోర్టు గురువారం ఈ మేరకు తీర్పు చెప్పింది. మరణ శిక్ష పడిన వారంతా ఖైమర్‌ హసీన్‌ గ్యాంగ్‌ సభ్యులు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

పీలీభీత్‌లో రవికాంత్‌ మిశ్ర ఇన్‌కం ట్యాక్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. బరేలీలో నివాసం ఉంటున్న ఆయన 2014 ఏప్రిల్‌ 21న ఉదయం 9 గంటలకు విధుల నిమిత్తం పీలీభీత్‌ వెళ్లారు. 23న ఆయన తిరిగి వచ్చేసరికి గేటు లోపల తాళం వేసి ఉండటం.. లోపల కిటికీ తెరిచి ఉండటం.. గ్రిల్స్‌ తొలగించి ఉండటం.. టెర్రస్‌ తలుపు తెరిచి ఉండటంతో ఆందోళనకు గురయ్యాడు. పక్కనే కొత్తగా నిర్మిస్తున్న భవనం పైనుంచి తన ఇంట్లోకి చూడగా.. మెట్లపై తన తల్లి పుష్ప (70) విగత జీవిగా పడి ఉన్నారు. సోదరుడు యోగేశ్, మరదలు ప్రియల మృతదేహాలు బెడ్‌రూంలో పడి ఉన్నాయి. ఇంట్లో దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనిపించాయి.

బాధితుడు ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించగా, విచారణ జరిపిన పోలీసులు ఈ మొత్తం ఉదంతంలో 9 మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో బంగారు వ్యాపారి కూడా ఉండటం గమనార్హం. నిందితులు పక్కన నిర్మిస్తున్న ఇంట్లో నుంచి మిశ్ర నివాసంలోకి ప్రవేశించారు. వారి అలజడికి నిద్ర లేచిన పుష్పను ఇటుకతో కొట్టి చంపేశారు. యోగేశ్, ప్రియలను గడ్డపారతో హతమార్చారు. పోలీసులు నెలరోజుల్లోపే.. అంటే 2014 మే 2వ తేదీన నిందితుల స్థావరాన్ని గుర్తించి వారిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన బరేలీ కోర్టు పై తీర్పు విధించింది. మరణశిక్ష పడినవారిలో వాజిద్, హసీన్, యాసిన్‌ అలియాస్‌ జీషన్, నజీమా, హషీమా, సమీర్‌ అలియాస్‌ సాహిబ్, జుల్ఫాం, పాహిం ఉన్నారు.

First Published:  8 March 2024 2:22 AM GMT
Next Story