Telugu Global
National

కరెంటు వైర్లు తగిలి బస్సు దగ్ధం.. 8 మంది సజీవ దహనం

గమనించిన గ్రామస్తులు కేకలు పెట్టినప్పటికీ డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దీంతో వారు ద్విచక్ర వాహనంపై బస్సును వెంబడించి వాహనాన్ని ఆపారు.

కరెంటు వైర్లు తగిలి బస్సు దగ్ధం.. 8 మంది సజీవ దహనం
X

కరెంటు వైర్లు తగిలి బస్సు దగ్ధమైన ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ అత్యంత విషాదకర సంఘటన హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లాలోని కేఎంపీ ఎక్స్ ప్రెస్ వేపై జరిగింది. చండీగఢ్, పంజాబ్‌కు చెందిన పలువురు భక్తులు ఓ ప్రైవేట్ బస్సును అద్దెకు తీసుకొని బనారస్, బృందావనన్, మధుర సందర్శనకు బయలుదేరారు.

ఉత్తరప్రదేశ్ లోని మధురను సందర్శించుకున్న అనంత‌రం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లాలోని కేఎంపీ ఎక్స్ ప్రెస్ వేపై వెళుతుండగా శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో బస్సుకు కరెంట్ వైర్లు తగిలాయి. దీంతో బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగాయి.

ఇది గమనించిన గ్రామస్తులు కేకలు పెట్టినప్పటికీ డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దీంతో వారు ద్విచక్ర వాహనంపై బస్సును వెంబడించి వాహనాన్ని ఆపారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారు వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. అయితే ఈ లోగానే బస్సు మొత్తం మంటలు అలుముకోవడంతో 8 మంది సజీవ దహనం అయ్యారు. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది భక్తులు ఉన్నారని, వారిలో 8 మంది మృతి చెందినట్లు ఎస్పీ నరేంద్ర బిజారానియా ధ్రువీకరించారు. మంటల్లో చిక్కుకొని గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్ప‌త్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

First Published:  18 May 2024 6:21 AM GMT
Next Story