Telugu Global
National

పార్టీలకొచ్చే విరాళాల్లో 66 శాతం అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచే...!

ADR నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఏడు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, ఎన్‌పీపీలకు మొత్తం రూ. 2,172 కోట్ల ఆదాయం రాగా,అందులో 66 శాతం అజ్ఞాత వ్యక్తుల నుంచి అందింది.

పార్టీలకొచ్చే విరాళాల్లో 66 శాతం అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచే...!
X

రాజకీయ పార్టీలకొచ్చే విరాళాలు ఎవరిస్తున్నారు అనేది తెలుసుకునే అధికారం ప్రజలకుంటుంది. అయితే చట్టం పార్టీలకు ఓ వెసులుబాటు కలిగించడంతో దాని ఆధారంగా రాజకీయ పార్టీలు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పడం లేదు. చట్ట ప్రకారం 20 వేల రూపాయల లోపు వచ్చే విరాళాలను ఎవరిచ్చారు అన్నది పార్టీలు చెప్పనక్కరలేదు. దీన్ని అడ్డు పెట్టుకొని పార్టీలు పెద్ద ఎత్తున విరాళాలు పోగుచేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు చూపించే విరాళాల్లో 66 శాతం అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచే అని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ADR) వెల్లడించింది.

ADR నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఏడు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, ఎన్‌పీపీలకు మొత్తం రూ. 2,172 కోట్ల ఆదాయం రాగా,అందులో 66 శాతం అజ్ఞాత వ్యక్తుల నుంచి అందింది. ఇక ఆయా పార్టీలకు వచ్చిన విరాళాల్లో సగం ఒక్క బీజేపీకే వచ్చాయి. దాని తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది.

జాతీయ పార్టీలన్నింటికీ కలిపి వచ్చిన విరాళాలు రూ.2,172 కోట్లు కాగా , రూ.1,161 కోట్ల ఆదాయం ఒక్క బీజేపీకే వచ్చినట్టు ADR పేర్కొంది. ఇది ఆరు పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో సగానికంటే ఎక్కువ.

బీజేపీ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు రూ. 528 కోట్ల ఆదాయం వచ్చింది. ఇతర జాతీయ పార్టీల ఆదాయంలో ఇది 24.31 శాతం. అలాగే, 2021-22లో వివిధ మార్గాల ద్వారా జాతీయ పార్టీలు రూ. 17,249.45 కోట్లను విరాళాలుగా పొందాయి.

First Published:  12 March 2023 2:39 AM GMT
Next Story