Telugu Global
National

దేశంలో 60 శాతం పిల్లలు రోజుకి 3 గంటలు మొబైల్‌లోనే... సర్వే

దేశంలోని 298 జిల్లాలకు చెందిన 40 వేల మందితో నిర్వహించిన ఓ సర్వే లో తల్లిదండ్రులు ఈ అభిప్రాయాలు వెల్లడించారు.

దేశంలో 60 శాతం పిల్లలు రోజుకి 3 గంటలు మొబైల్‌లోనే... సర్వే
X

తమ పిల్లల్లో గత కొంత కాలంగా సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశంలోని అర్బన్ ప్రాంత తల్లిదండ్రులు. రోజుకు సుమారు మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వారు సోషల్ మీడియా, వీడియోలు, OTT మరియు ఆన్‌లైన్ గేమ్‌లపై గడుపుతున్నారని చెబుతున్నారు. ఇది వారిలో దుడుకుతనాన్ని, తొందరపాటు స్వభావాన్ని పెంచుతోంది అంటున్నారు. దేశంలోని 298 జిల్లాలకు చెందిన 40 వేల మందితో నిర్వహించిన ఓ సర్వే లో తల్లిదండ్రులు ఈ అభిప్రాయాలు వెల్లడించారు.

ఆధునిక కాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరుగుతోంది. పెద్దల సంగతి పక్కన పెడితే 9 - 17 సంవత్సరాల వయసు గల పిల్లలు దీనికి బానిసలుగా మారుతున్నారు. తాజా సర్వే ప్రకారం 9 నుంచి 17 సంవత్సరాల వయస్సున్న చిన్నారులు రోజులో 3 గంటల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారని తేలింది. ఈ వాస్తవాన్ని వారి తల్లిదండ్రులే పేర్కొన్నట్లు కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. దేశవ్యాప్తంగా జరిపిన ఈ సర్వేలో 61 శాతం అర్బన్ ఏరియా తల్లిదండ్రులు, 9 - 17 సంవత్సరాల వయస్సు గల వారి పిల్లలు ఇంటర్నెట్‌లో వీడియోలు చూడటం లేదా ఆటలు ఆడటం కోసం సోషల్ మీడియాలో రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారని పేర్కొన్నారు. 37% భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లలు వీడియోలు/OTT (యూట్యూబ్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ మొదలైనవి) చూడటంలో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని చెబుతున్నారు.

35% మంది సోషల్ మీడియాలోనూ (Instagram, WhatsApp, Snapchat, Be Real, మొదలైనవి), 33% మంది తమ పిల్లలు ఆన్‌లైన్ గేమింగ్‌ (Minecraft, PUBG, ఫోర్ట్‌నైట్, అమాంగ్ US, FIFA, ఫాంటసీ స్పోర్ట్స్, మొదలైనవి)లో నిమగ్నమై ఉంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, ఓటీటీ, వీడియో-ఆన్‌లైన్‌ గేమింగ్ ప్లాట్ ఫామ్‌లలో 18 ఏళ్ల లోపు యువత చేరడానికి వారి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేస్తూ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని రూపొందించాలని సర్వేలో పాల్గొన్న 73% తల్లిదండ్రులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

First Published:  26 Sep 2023 11:14 AM GMT
Next Story