Telugu Global
National

5Gతో భయం భయం.. ఐపీఎస్ ల హెచ్చరికలు

స్మగ్లర్లు, ఆర్థికపరమైన నేరగాళ్లు, ఉగ్రవాద సంస్థలకు 5G నెట్ వర్క్ వేదికగా మారే అవకాశం ఉందని భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు పలువురు ఐపీఎస్‌ అధికారులు ఢిల్లీలో జరుగుతున్న సదస్సులో 5జీ నెట్‌ వర్క్‌ పై ఒక నివేదిక సమర్పించారు.

5Gతో భయం భయం.. ఐపీఎస్ ల హెచ్చరికలు
X

టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ సౌకర్యం పెరుగుతుంది. అదే సమయంలో నాణేనికి మరోవైపు కూడా మనం ఆలోచించాలి. పెరుగుతున్న టెక్నాలజీ మోసగాళ్లకు కూడా వరంగా మారుతుంది. ఆన్ లైన్ పేమెంట్లతో అంతా బాగుంది, భారత్ లో డిజిటలైజేషన్ వచ్చేసింది అని సంతోషపడినా.. అదే సమయంలో ఆన్ లైన్ మోసాలు కూడా పెరిగిపోయాయి.


ఇప్పుడు 5G రంగప్రవేశం చేసింది. 5Gతో నెట్ స్పీడ్ పెరుగుతుంది, డౌన్ లోడ్లు చిటికెలో అయిపోతాయి, బఫరింగ్ బాధలు అస్సలు ఉండవు.. అని ఎన్నో ఉపయోగాల గురించి నిపుణులు ఏకరువు పెట్టినా, అదే సమయంలో మోసాలకు కూడా 5G బాగా ఉపయోగపడుతుందని ఐపీఎస్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న డీజీపీలు, ఐజీపీల సదస్సులో ఈ అనుమానాలు వ్యక్తమయ్యాయి.

స్మగ్లర్లు, ఆర్థికపరమైన నేరగాళ్లు, ఉగ్రవాద సంస్థలకు 5G నెట్ వర్క్ వేదికగా మారే అవకాశం ఉందని భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు పలువురు ఐపీఎస్‌ అధికారులు ఢిల్లీలో జరుగుతున్న సదస్సులో 5జీ నెట్‌ వర్క్‌ పై ఒక నివేదిక సమర్పించారు.

నిపుణుల అనుమానాలు..

5G నెట్‌వర్క్‌ సాయంతో HTTP, ట్రాన్స్‌ పోర్ట్‌ లేయర్‌ సెక్యూరిటీ వంటి ఇంటర్నెట్‌ ప్రోటోకాల్స్‌ ను సైబర్‌ నేరగాళ్లు సులభంగా యాక్సెస్‌ చేసి వాటి సాంకేతిక వ్యవస్థల్లోకి మాల్‌ వేర్‌ ను పంపి సైబర్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో 5G నెట్‌వర్క్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పలు సందర్భాల్లో సైబర్‌ నేరాలు జరిగిన తీరును గుర్తించడం సంక్లిష్టంగా మారుతుంది. మాదక ద్రవ్యాల సరఫరా, అక్రమ మానవ రవాణా, మనీలాండరింగ్‌, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం వంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు తమ మధ్య సమాచార మార్పిడికి 5G నెట్‌ వర్క్‌ లోని భద్రత వ్యవస్థను వేదికగా మార్చుకునే అవకాశం ఉంది.


5G లోని నెట్‌ వర్క్‌ ఫంక్షన్‌ వర్చువలైజేషన్‌ కారణంగా సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగత వివరాల్లో ఫోన్‌ నంబర్లను మార్చి, ఆన్ లైన్ బ్యాంకింగ్ పై దాడి చేయొచ్చు, మొబైల్‌ ఆధారిత సేవలను తమ ఆధీనంలోకి తీసుకునే అవకగాశముంది. 5G నెట్‌ వర్క్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సపోర్ట్‌ చేస్తుండటంతో మొబైల్‌ నెట్‌ వర్క్‌ మ్యాపింగ్‌, మాల్‌ వేర్‌ ప్రవేశపెట్టడం, DNS స్పూఫింగ్‌ వంటి వాటిని సైబర్‌ నేరగాళ్లు సులభంగా చేయగలరు. 5G నెట్‌ వర్క్‌ సంస్థలు యూజర్ల విలువైన సమాచారాన్ని అడ్వర్టైజ్ మెంట్ సంస్థలకు అమ్మే సందర్భంలో అవి సంఘవిద్రోహులకు చేరే అవకాశం కూడా ఉంది.

ఇలాంటి అనుమానాలు లేవనెత్తిన ఐపీఎస్ లు వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. వినియోగదారులకు అందుతున్న సేవలకు పూర్తిస్థాయిలో సైబర్‌ భద్రత అందించాలన్నారు. ఐవోటీ భద్రత గురించి ఎప్పటికప్పుడు యూజర్లకు అవగాహన కల్పించాలన్నారు. 5G నెట్‌ వర్క్‌ ఆపరేటర్లు హైబ్రిడ్‌ క్లౌడ్‌ విధానాన్ని అనుసరించి.. సున్నితమైన డేటాను లోకల్‌ సర్వర్లలో భద్రపరచాలని సూచించారు.


మొబైల్‌ నెట్‌ వర్క్‌ సంస్థలు నెట్‌ వర్క్‌ ట్రాన్స్ మిషన్ కోసం ఉపయోగించే విడిభాగాలు చైనా నుంచి కాకుండా ఇతర నమ్మకమైన సంస్థలనుంచి కొనుగోలు చేయాలని సూచించారు. ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం, ప్రభుత్వ ఆఫీస్ లలో చైనా తయారీ సీసీ కెమెరాల వినియోగాన్ని నిషేధించిన అంశాన్ని వారు గుర్తు చేశారు. అంటే 5Gతో ఎన్ని లాభాలు ఉంటాయో, అంతకు మించి నష్టాలు కూడా ఉండే అవకాశముంది. దీనిపై ముందస్తుగా ఢిల్లీలో జరిగిన డీజీపీ, ఐజీపీల సదస్సులో కీలక చర్చ జరిగింది.

First Published:  25 Jan 2023 5:51 AM GMT
Next Story