Telugu Global
National

భగవంత్ మాన్ మరో సంచలన నిర్ణయం.. కులం పేరిట ఉన్న పాఠశాలల పేర్ల తొలగింపు

రాష్ట్రంలో 56 పాఠశాలలకు కులం, వర్గం ఆధారంగా పేర్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ పాఠశాలల పేర్లను అమరవీరులు, ప్రముఖుల పేర్లకు మార్చాలని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు వాటి పేర్లు మార్చారు.

భగవంత్ మాన్ మరో సంచలన నిర్ణయం.. కులం పేరిట ఉన్న పాఠశాలల పేర్ల తొలగింపు
X

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చి రాగానే ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలను పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా వ్యక్తిగత నెంబర్‌ను ప్రజలకు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వీఐపీలకు ఉన్న భద్రతను తొలగించారు. మాజీ ఎమ్మెల్యేలకు వచ్చే పెన్షన్‌లో కోత విధించారు. ఇలా వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మాన్ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా కులం పేరుతో, వర్గం పేరుతో పెట్టిన పాఠశాలలకు వాటి పేర్లను తొలగించారు. ఆ స్థానంలో అమరవీరులు, ప్రముఖుల పేర్లను పెట్టారు. రాష్ట్రంలోని పలు పాఠశాలలకు కులం, వర్గం పేరిట పేర్లు ఉన్నట్లు కొద్ది రోజుల కిందట ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి హర్ జోత్ సింగ్ అలాంటి పేర్లతో ఉన్న పాఠశాల జాబితాను తెప్పించారు. మొత్తం రాష్ట్రంలో 56 పాఠశాలలకు కులం, వర్గం ఆధారంగా పేర్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ పాఠశాలల పేర్లను అమరవీరులు, ప్రముఖుల పేర్లకు మార్చాలని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు వాటి పేర్లు మార్చారు.

ఈ సందర్భంగా మంత్రి హర్ జోత్ సింగ్ మాట్లాడుతూ సమానత్వం ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ ఒకే తరహా విద్య అందించాలన్నారు. పాఠశాలల పేర్లు ఒక కులానికో, వర్గానికో చెందినవిగా ఉండకూడదని సూచించారు. అలా చేయడం వల్ల సమాజంలో కుల విభజనకు దారితీసినట్లు అవుతుందన్నారు. అందుకే పాఠశాలలకు కులం, వర్గం పేరిట ఉన్న పేర్లను మార్చినట్లు ఆయన వెల్లడించారు.

First Published:  31 Dec 2022 6:58 AM GMT
Next Story