Telugu Global
National

ఫోన్ పోయింది, ఉద్యోగం పోయింది.. 53వేలు జరిమానా పడింది

ఒక్కో క్యూబిక్‌ మీటరుకు రూ.10.50 చొప్పున అతడికి రూ.43,092 జరిమానా విధించింది. అనుమతి లేకుండా నీటిని తోడేసినందున మరో రూ.10 వేలు అదనంగా ఫైన్ వేసింది.

ఫోన్ పోయింది, ఉద్యోగం పోయింది.. 53వేలు జరిమానా పడింది
X

కొత్త ఫోన్ కొన్నాక అతడికి దరిద్రం పట్టుకున్నట్టయింది. నీళ్లలో పడి ఫోన్ పాడైపోయింది, ఆ నీటిని పారబోసినందుకు ఉద్యోగం పోయింది, చివరిగా ఇప్పుడు పారబోసిన నీటికి లెక్కగట్టి 53వేల రూపాయలు జరిమానా విధించారు అధికారులు. దీంతో చత్తీస్ ఘడ్ లో ఫుడ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న రాజేష్ లబోదిబోమంటున్నాడు. చేసిన వెధవ పనికి తీరిగ్గా విచారిస్తున్నాడు.

చత్తీస్ ఘడ్ లో ఫుడ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న రాజేష్ విశ్వాస్ అనే యువ ఉద్యోగి ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈనెల 21న పరల్ కోట్ రిజర్వాయర్ వద్దకు వెళ్లిన రాజేష్ సరదాగా సెల్ఫీ తీసుకుంటుండగా ఫోన్ నీళ్లలో పడిపోయింది. 96వేల రూపాయలు పెట్టి కొన్న కొత్త ఫోన్ కావడంతో.. అందులో అధికారిక సమాచారం ఉందంటూ హడావిడి చేశాడు. గజ ఈతగాళ్లతో వెదికించినా ఫలితం లేకపోవడంతో నీటిపారుదల శాఖ అధికారులకు చెప్పి రిజర్వాయర్ లో నీటిని ఖాళీ చేయించాడు. ఎట్టకేలకు ఫోన్ దొరికింది కానీ, మూడు రోజులపాటు నీళ్లలో నానిపోవడంతో పాడైపోయింది. అయితే ఈ వ్యవహారం బయటపడటంతో రాజేష్ పరువు పోయింది. సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. ఫోన్ కోసం నీటిని వృథా చేసిన రాజేష్ దేశవ్యాప్తంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అదే సమయంలో విలువైన నీటిని ఫోన్ కోసం వృథాగా పారబోసినందుకు సంబంధిత శాఖ అధికారులపై కూడా విమర్శలు వచ్చాయి.

ఆ ఫోన్ లో అధికారిక సమాచారం ఉందంటూ తమను బురిడీ కొట్టించి రాజేష్ నీటిని పారబోయించాడని చెప్పారు చత్తీస్ ఘడ్ జలవనరుల శాఖ అధికారులు. కొంతమేర నీటిని వదిలేస్తామంటే ఒప్పుకున్నాం కానీ, ఇలా 41 లక్షల లీటర్ల నీరు పారబోస్తాడని అనుకోలేదని వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యవహారం సంచలనం కావడంతో వెంటనే రాజేష్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతడిని విధులనుంచి సస్పెండ్ చేశారు. ఇటు రిజర్వాయర్ లోని నీటిని పారబోసినందుకు గాను చత్తీస్ ఘడ్ జల వనరుల శాఖ భారీ జరిమానా విధించింది. ఒక్కో క్యూబిక్‌ మీటరుకు రూ.10.50 చొప్పున అతడికి రూ.43,092 జరిమానా విధించింది. అనుమతి లేకుండా నీటిని తోడేసినందున మరో రూ.10 వేలు అదనంగా ఫైన్ వేసింది. ఫోన్ పోయింది, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు, ఇప్పుడు 53వేలు ఫైన్ కూడా పడటంతో లబోదిబోమంటున్నాడు రాజేష్.

First Published:  31 May 2023 5:59 AM GMT
Next Story