Telugu Global
National

స్త్రీల‌కు రిజ‌ర్వేష‌న్ పోయి.. పురుషుల‌కు రిజ‌ర్వేష‌న్ వ‌చ్చింది

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. అయితే టికెట్ లేకుండా అందరూ మహిళలే ప్రయాణిస్తే సంస్థకు నష్టం వస్తుందని భావించి.. బస్సుల్లో 50 శాతం సీట్లు పురుషులకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

స్త్రీల‌కు రిజ‌ర్వేష‌న్ పోయి.. పురుషుల‌కు రిజ‌ర్వేష‌న్ వ‌చ్చింది
X

ఏ రాష్ట్రానికి వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కినా అందులో మెజారిటీ సీట్లు మహిళలకే కేటాయించబడి ఉంటాయి. ముగ్గురు కూర్చునే సీట్లు ఎక్కువ భాగం వారికే కేటాయిస్తుంటారు. అంతేకాకుండా ఇవి మహిళలకు కేటాయించిన సీట్లు అని స్టిక్కర్లు అతికిస్తారు. దానికితోడు ‘స్త్రీలను గౌరవిద్దాం.. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం’ అని కొటేష‌న్ సైతం రాస్తారు.

ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం సీట్లు పురుషులకే కేటాయిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా బస్సుల్లో ఇవి పురుషులు కూర్చునే సీట్లు అని స్టిక్కర్లు కూడా అతికిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన సంగతి తెలిసిందే. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది.

కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. కాగా, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంతో మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించడానికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో బస్సుల్లోని సీట్లు మహిళలతో నిండిపోతున్నాయి. టికెట్ లేకుండా అందరూ మహిళలే ప్రయాణిస్తే సంస్థకు నష్టం వస్తుందని భావించిన ఆర్టీసీ.. బస్సుల్లో 50 శాతం సీట్లు పురుషులకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

మగవాళ్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తోంది. ఎందుకంటే టికెట్‌ వారు మాత్రమే తీసుకుంటారు కాబట్టి బస్సుల్లో ఇవి మగవాళ్లకు కేటాయించిన సీట్లు అని అర్థమ‌య్యేలా స్టిక్కర్లు కూడా అతికిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు భారీగా ఉచితాలు ప్రకటించింది. ఇప్పుడు ఆ ఉచితాల ప్రభావం ఒక్కొక్కటిగా కనిపిస్తోంది.

First Published:  7 Jun 2023 8:24 AM GMT
Next Story