Telugu Global
National

ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష.. 48 గంటల్లో 31 మంది మృతి.. ఎక్కడంటే?

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులలేమి, సిబ్బంది కొరతే ఈ మరణాలకు కారణమని ప్రతిపక్షాలు మండిపడుతుండగా, వరుస మరణాలపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర వైద్య విద్య మంత్రి హసన్ ముష్రిఫ్ ప్రకటించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష.. 48 గంటల్లో 31 మంది మృతి.. ఎక్కడంటే?
X

గత కొన్ని గంటలుగా మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతువు వీర విహారం చేస్తోంది. గంట గంటకి చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రెండు రోజులుగా అంటే 48 గంటల్లో ఏకంగా 31 మంది మృత్యువాత‌ప‌డ్డారు. చ‌నిపోయిన‌వారిలో 16 మంది చిన్నారులే ఉన్నారు. సోమవారం వరకు 24 గంటల్లో 24 మంది చనిపోగా తాజాగా మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. ఈ రోజు చనిపోయిన ఏడుగురిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నాందేడ్ జిల్లా సమాచార కార్యాలయం(డిఐఓ) ప్రకటించింది. మొత్తం మరణాల సంఖ్య 31కి చేరుకున్నట్లు వెల్లడించింది. మృతుల సంఖ్య అంతకంతకీ పెరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులలేమి, సిబ్బంది కొరతే ఈ మరణాలకు కారణమని ప్రతిపక్షాలు మండిపడుతుండగా, వరుస మరణాలపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర వైద్య విద్య మంత్రి హసన్ ముష్రిఫ్ ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నానికి కమిటీ త‌న‌ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.


నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్న విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వసతులలేమి, సిబ్బంది కొరతే ఈ మరణాలకు కారణమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆరోపించారు. రోగులకు అవసరమైన మందులను, చికిత్సను అందచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ ఘోరంగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితర నేతలు సామాజిక మాధ్యమాలలో ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, కూల్చడం, ఎమ్మెల్యేలను కొనడం, అమ్మడంలో బిజీగా ఉన్న బీజేపీకి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని ఆయన అన్నారు. ఘటనపై పూర్తిస్థాయి వివరణాత్మక విచారణకు డిమాండ్ చేశారు.


కొద్దిరోజుల క్రితం థానే ఆస్పత్రిలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. అక్కడ 36 గంటల్లో 22 మంది రోగులు మరణించారు.


First Published:  3 Oct 2023 8:51 AM GMT
Next Story