Telugu Global
National

మణిపూర్ ఘర్షణల్లో 31మంది మృతి!

కాల్పులు, సామూహిక హింస కారణంగా మరణించిన వారి సంఖ్యపై మణిపూర్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబ సభ్యులకథనాలు, ఆసుపత్రి మార్చురీ రికార్డులు ఆధారంగా ఉఖ్రుల్ టైమ్స్ పత్రిక మరణాల సంఖ్యను పేర్కొంది. అయితే మరణాలు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఆ పత్రిక తెలిపింది.

మణిపూర్ ఘర్షణల్లో 31మంది మృతి!
X

మణిపూర్ లోని వివిధ ప్రాంతాలలో మే 3 రాత్రి నుండి కుకి తెగ ఆదివాసులు గిరిజనేతర మైతేయి కమ్యూనిటీ ల మధ్య జరుగుతున్న కాల్పులు, దాడులు..తదితర హింసాయుత సంఘటనల్లో ఇప్పటి వర్కు 31 మందిమరణించినట్టు స్థానిక మీడియా ఉఖ్రుల్ టైమ్స్ పేర్కొంది.

కాల్పులు, సామూహిక హింస కారణంగా మరణించిన వారి సంఖ్యపై మణిపూర్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబ సభ్యులకథనాలు, ఆసుపత్రి మార్చురీ రికార్డులు ఆధారంగా ఉఖ్రుల్ టైమ్స్ పత్రిక మరణాల సంఖ్యను పేర్కొంది. అయితే మరణాలు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఆ పత్రిక తెలిపింది.

ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జెఎన్‌ఐఎంఎస్)కి తరలించిన మృతదేహాల సంఖ్య 13గా ఉందని , ఇంఫాల్ లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) మార్చురీ లో ఉన్న డెడ్ బాడీల లెక్క ప్రకారం మరో 18 మంది మరణించారు.

కాగా, ఇంఫాల్‌కి చెందిన సాంగై ఎక్స్‌ప్రెస్ అనే పత్రిక మరో 11మంది చనిపోయారని తెలిపింది.

“అయితే, ఈ నివేదికను దాఖలు చేసే సమయంలో మృతదేహాలను ఇంకా గుర్తించ లేదు. మణిపూర్‌లోని ఇతర ప్రాంతాలలో కుకీ గిరిజనులు, మైతేయి/మీటీ కమ్యూనిటీల మధ్య జరిగిన జాతి హింస కారణంగా సంభవించిన మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.''అని ఉఖ్రుల్ టైమ్స్ నివేదిక పేర్కొంది.

మే 4 ఉదయం నుండి చాలా గంటలపాటు శాంతియుతంగా ఉందని, అయితే రాత్రి ఇరు వర్గాల మధ్య మళ్ళీ హింస చెలరేగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

చురచంద్‌పూర్ పట్టణానికి చెందిన ఢిల్లీలో చదువుకుంటున్న‌ విద్యార్థి తవ్నా వాల్టే మాట్లాడుతూ, పోలీసులు పట్టణ ప్రాంతం, జిల్లాలోని కొన్ని ఇతర ప్రాంతాల గుండా మార్చ్ నిర్వహించారని, అయితే 3 గంటలకు, సమీపంలో తుపాకీ కాల్పులు వినబడ్డాయి.'' అని తెలిపారు.

పట్టణంలోని మరో నివాసి, మువాన్లియన్ టోన్సింగ్ మాట్లాడుతూ, ''అనేక మంది గిరిజనులు లోయలో చిక్కుకపోయారు. రోడ్డు మార్గంలో వస్తే తమను చంపేయవచ్చనే భయంతో కొండలకు వెళ్లేందుకు భయపడి లోయలో చిక్కుకుపోయారని" చెప్పారు.

గిరిజనేతరులైన మైతేయి కమ్యూనిటీని ఎస్ టీల్లో చేర్చ‌డంతో ఈ ఘర్షణ ప్రారంభమైంది. జనాభాలో అధిక శాతం ఉన్న బ్రాహ్మణ కమ్యూనిటీ అయిన మైతేయీలను రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఎస్ టీల్లో చేర్చిందని ఆదివాసులైన కుకీలు ఆరోపిస్తున్నారు. మే 3 వతేదీ నుండి ఆదివాసులు పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. మైతేయీ కమ్యూనిటీ ప్రజలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలో ప్రభుత్వం ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. గిరిజనేతర ఆధిపత్య ఇంఫాల్ పశ్చిమ, కక్చింగ్, తౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతో సహా మణిపూర్‌లోని ఎనిమిది జిల్లాలలో కర్ఫ్యూ విధించారు. ప్రధానంగా గిరిజనేతరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే హింస చెలరేగుతోంది.

First Published:  6 May 2023 2:46 AM GMT
Next Story