Telugu Global
National

మేఘాల‌య‌లో మిత్ర ప‌క్ష ఎమ్మెల్యేలకే బిజెపి గాలం..ముగ్గురు రాజీనామా!

ఎన్పిపి శాసనసభ్యులు ఫెర్లిన్ సంగ్మా, బెనెడిక్ మరాక్ , టిఎంసి స‌భ్యుడు హెచ్ ఎం షాంగ్‌ప్లియాంగ్ స్పీకర్ మెత్‌బా లింగ్‌డోహ్‌కు తమ రాజీనామాలను సమర్పించార‌ని అసెంబ్లీ కమిషనర్, కార్యదర్శి ఆండ్రూ సైమన్స్ చెప్పారు. వారు తమ తమ పార్టీల సభ్యత్వానికి కూడా రాజీనామాలు చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మేఘాల‌య‌లో మిత్ర ప‌క్ష ఎమ్మెల్యేలకే బిజెపి గాలం..ముగ్గురు రాజీనామా!
X

భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి) అధికారం కోసం మిత్ర‌ప‌క్షాల‌నైనా ప‌క్క‌కు గెంటేయ‌గ‌ల‌ద‌ని మ‌రో సారి రుజువు చేస్తోంది. వ‌చ్చే యేడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న మేఘాల‌య‌పై బిజెపి క‌న్నేసింది. ఈ సారి స్వ‌తంత్రంగా అధికారంలోకి వ‌చ్చేందుకు వీలుగా ఇప్ప‌టినుంచే ఎమ్మెల్యేల‌కు గాలం వేస్తూ వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే నిన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఎన్ పిపి నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్‌లో బిజెపి మిత్ర ప‌క్షంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఎన్పిపి శాసనసభ్యులు ఫెర్లిన్ సంగ్మా, బెనెడిక్ మరాక్ , టిఎంసి స‌భ్యుడు హెచ్ ఎం షాంగ్‌ప్లియాంగ్ స్పీకర్ మెత్‌బా లింగ్‌డోహ్‌కు తమ రాజీనామాలను సమర్పించార‌ని అసెంబ్లీ కమిషనర్, కార్యదర్శి ఆండ్రూ సైమన్స్ చెప్పారు. వారు తమ తమ పార్టీల సభ్యత్వానికి కూడా రాజీనామాలు చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిని బిజెపి స్వాగ‌తించ‌డంతో వీరి రాజీనామాల వెన‌క బిజెపి హ‌స్తం ఉంద‌నే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. వీరు ముగ్గురు వ‌చ్చే నెలలో బిజెపిలో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాజీనామాలు చేసిన ఈ ఎమ్మెల్యేల‌ను బిజెపి సీనియ‌ర్ నేత ఒక‌రు స్వాగతించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ, "రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించే ఏకైక పార్టీ బిజెపి అని వారు గ్రహించారు" అని అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మేఘాలయలో ఎన్నికలు జరగనున్నాయి.

First Published:  29 Nov 2022 2:38 AM GMT
Next Story