Telugu Global
National

గుజ‌రాత్ లో క‌ల్తీ మ‌ద్యానికి 28 మంది బ‌లి..45 మందికి తీవ్ర అస్వ‌స్థ‌త

మద్య నిషేధం అమలులో ఉన్న గుజరాత్ లో కల్తీ మద్యం తాగి 28 మంది చనిపోయారు. 45 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.

గుజ‌రాత్ లో క‌ల్తీ మ‌ద్యానికి 28 మంది బ‌లి..45 మందికి తీవ్ర అస్వ‌స్థ‌త
X

గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలో నకిలీ మద్యం సేవించి 28 మంది మరణించిన ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇదే ఘ‌ట‌న‌లో సుమారు 45 మంది వివిధ ఆసుపత్రులలో చేరారు. వీరిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మృతుల‌లో 22 మంది బోటాడ్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందినవారు కాగా, ఆరుగురు పొరుగున ఉన్న అహ్మదాబాద్ జిల్లాకు చెందినవారు అని మంగళవారంనాడు అధికారులు తెలిపారు.

బొటాడ్ జిల్లా బర్వాలా తాలూకాలోని రోజిద్ గ్రామంతో పాటు చుట్టుపక్కల కొన్ని గ్రామాల నివాసితులు సోమవారం తెల్లవారుజామున కల్తీ మద్యం సేవించారు. ఇది జ‌రిగిన‌ కొన్ని గంటల్లోనే వారి ఆరోగ్యం క్షీణించడంతో వారిని బర్వాలా, బొటాడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకరావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్‌తో ఈ మద్యాన్ని తయారు చేశార‌ని, దీనిని నేరుగా నీటిలో కలుపుతార‌ని గుజ‌రాత్ డిజిపి ఆషిష్ భాటియా గాంధీనగర్‌లో విలేకరులతో చెప్పారు. 600 లీటర్లకు పైగా ఉన్న ఈ మిశ్రమం రూ.40 వేలకు అమ్ముడు పోయిందన్నారు. "మృతులంతా మిథైల్ ఆల్కహాల్ సేవించినట్లు ఫోరెన్సిక్ నివేదిక‌లు నిర్ధారించాయి. హత్య, ఇతర నేరాలకు సంబంధించి 14 మందిపై కేసు నమోదు చేసాము. ఇప్పటికే చాలా మంది నిందితులను అదుపులోకి తీసుకున్నాము" అని భాటియా చెప్పారు.

భావ్‌నగర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ యాదవ్ సోమవారం సాయంత్రం బొటాడ్ సివిల్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి, నకిలీ మద్యం విక్రయించిన వారిని పట్టుకోవడానికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ప్ర‌త్యేక బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తామని చెప్పారు. .

కాగా, ఈ ఘటనను ప్ర‌భుత్వం సీరియస్‌గా తీసుకుంద‌ని, దీనిపై హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగిందని గుజరాత్ సీఎంఓ తెలిపింది.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని,అరాచ‌కాలు జ‌రుగుతున్నా అధికారంలో ఉన్న బిజెపి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నిషేధం అమలులో ఉన్న గుజరాత్‌లో పెద్దఎత్తున అక్రమ మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం విక్రయించే వ్యక్తులు రాజకీయ రక్షణ పొందుతున్నారని ఆరోపించిన ఆయన, మద్యం విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ముపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

First Published:  26 July 2022 2:30 PM GMT
Next Story