Telugu Global
National

లీటర్ డీజిల్ పై రూ.25 రాయితీ.. ఎప్పుడు..? ఎక్కడ..?

రాహుల్, ప్రియాంక.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాహుల్ గాంధీ తాజాగా మత్స్యకారులను ఆకట్టుకునే హామీలు ప్రకటించారు.

లీటర్ డీజిల్ పై రూ.25 రాయితీ.. ఎప్పుడు..? ఎక్కడ..?
X

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంటున్నాయే కానీ, ఎవరి సపోర్ట్ లేకుండా అధికారం చేజిక్కుతుందని మాత్రం చెప్పలేకపోతున్నాయి. ఈ దశలో ఇంకాస్త కష్టపడితే సోలోగా అధికారం దక్కొచ్చనే అంచనాలో కాంగ్రెస్ నేతలు చెమటోడుస్తున్నారు. రాహుల్, ప్రియాంక.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాహుల్ గాంధీ తాజాగా మత్స్యకారులను ఆకట్టుకునే హామీలు ప్రకటించారు.

కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మత్స్యకార వర్గానికి రూ.10లక్షల బీమా సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తామన్నారు రాహుల్ గాంధీ. వడ్డీ లేకుండా బ్యాంకులనుంచి లక్ష రూపాయల రుణం ఇప్పిస్తామని చెప్పారు. డీజిల్ పై రాయితీ ఇస్తామంటూ కీలక హామీ ఇచ్చారు.

మత్స్యకారుల ప్రధాన జీవనాధారం చేపల వేట. వేటకోసం పడవల్లో వెళ్లేందుకు వారికి డీజిల్ తప్పనిసరి. మోదీ హయాంలో డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతిన్నది. దీంతో ఆ వర్గాన్ని ఆకట్టుకునేలా డీజిల్ పై రాయితీ ఇస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ. రోజుకు 500 లీటర్ల వరకు ఒక్కో లీటరు డీజిల్‌పై రూ.25 రాయితీగా అందిస్తామని హామీ ఇచ్చారు.

అవినీతి, ధరల పెరుగుదల వల్ల మత్స్యకారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంకు రుణాలు పొందడం కూడా వారికి కష్టంగా మారిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. అందుకే మత్స్యకారులకు ఉపశమనం కలిగించే చర్యలపై కాంగ్రెస్‌ దృష్టిపెడుతోందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తానిచ్చిన హామీలన్నీ తొలి కేబినెట్‌ సమావేశంలోనే అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్‌ కేవలం హామీలు మాత్రమే ఇవ్వదని.. వాటిని తొలి రోజు నుంచే అమలు చేస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ హామీలివే..

కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే చాలా హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌(గృహజ్యోతి), మహిళలకు నెలకు రూ.2వేల ఆర్థిక సాయం (గృహలక్ష్మి), దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ 10కిలోల వరకు ఉచిత బియ్యం (అన్న భాగ్య), డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఇంకా ఉద్యోగాల్లో కుదురుకోని వారికి నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నది కాంగ్రెస్. తాజాగా మత్స్యకార వర్గానికి భారీ హామీలను ఇచ్చింది.

First Published:  27 April 2023 2:33 PM GMT
Next Story