Telugu Global
National

2023 కర్నాటక శాసనసభ ఎన్నికలు: అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్...'సౌత్ ఫస్ట్' సర్వే రిజల్ట్స్

కర్ణాటకలో సౌత్ ఫస్ట్ కోసం పీపుల్స్ పల్స్, CICERO నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ 101 (+/- 9) సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. అధికార BJPకి 91 (+/-7) సీట్లు, జనతాదళ్ (సెక్యులర్) కు 29 (+/-5) సీట్లు వస్తాయని అంచనా వేసింది.

2023 కర్నాటక శాసనసభ ఎన్నికలు: అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్...సౌత్ ఫస్ట్ సర్వే రిజల్ట్స్
X

ఈ ఏడాది ఏప్రిల్‍, మే నెలల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించనుందని సౌత్ ఫస్ట్-పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది.

2022 , డిశంబర్ 22 నుండి 31 వరకు నిర్వహించిన ఈ సర్వేలో అధికార బీజేపీ ఇప్పుడున్న సీట్లలో 13 సీట్లు కోల్పోతుందని తేల్చింది. సర్వేలో పాల్గొన్న ప్రజలు ఎక్కువశాతం తమ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్యను కోరుకున్నారు.

కర్ణాటకలో సౌత్ ఫస్ట్ కోసం పీపుల్స్ పల్స్, CICERO నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ 101 (+/- 9) సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. అధికార BJPకి 91 (+/-7) సీట్లు, జనతాదళ్ (సెక్యులర్) కు 29 (+/-5) సీట్లు వస్తాయని అంచనా వేసింది.

అంటే, ఈ సారి కూడా గత సారి లాగే కర్ణాటకలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటులో JD(S)దే కీలక పాత్ర ఉండబోతుంది.

ఈ సర్వే మొత్తం మూడు విడతలుగా నిర్వహించబడుతోంది. మొదటి విడత డిశంబర్ 22 నుండి 31 వరకు నిర్వహించబడింది. మరో రెండు సర్వేలు ఒకటి, మార్చి 2023లో, మరొకటి ఎన్నికలకు కొద్ది ముందు నిర్వహిస్తారు.

ఈ సర్వేలో పాల్గొన్న 28 శాతం ప్రజలు సిద్దరామయ్యను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంచుకున్నారు. బీజెపికి చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని 19 శాతం మంది,జెడి (ఎస్) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామిని 18 శాతం మంది, బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పను 11 శాతం మంది, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ ను 5 శాతం మంది తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కోరుకున్నారు.

సర్వేలో పాల్గొన్న‌ వారిలో 41 శాతం మంది ఒక వేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకోగా, 38 శాతం మంది బీజేపీ-జేడీ(ఎస్) కూటమిని ఎంచుకున్నారు.

సౌత్ ఫస్ట్-పీపుల్స్ పల్స్ మొదటి సర్వే ప్రకారం, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకన్నా 2 శాతం కంటే పైగా ఓట్లు అధికంగా పొందనుంది. సర్వేలో భాగంగా నిర్వహించిన రహస్య బ్యాలెట్‌లో 2018లో 38 శాతం ఉన్న కాంగ్రెస్‌ ఓట్ల శాతం వచ్చే ఎన్నికల్లో 40 శాతానికి పెరుగుతుందని తేలింది.

ఇలా 2 శాతం ఓట్ల శాతం పెరగడం వల్ల కాంగ్రెస్‌కు 22 సీట్లు అధికంగా వస్తాయని సర్వే తేల్చింది.

బీజేపీ గత ఎన్నికలకన్నా కేవలం 0.2 శాతం ఓట్లను కోల్పోయే అవకాశం ఉంది, అయితే ఆ స్వల్ప తగ్గుదల వల్ల ఆ పార్టీకి 13 సీట్లు తగ్గుతాయని అంచనా.

JD(S) గత ఎన్నికలకన్నా 2.4 శాతం ఓట్లను కోల్పోవడం వల్ల‌ కేవలం 29 సీట్లకు మాత్రమే పరిమితమవుతుంది.

సౌత్ ఫస్ట్-పీపుల్స్ పల్స్ కర్ణాటకలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 224 ప్రాంతాల్లో మొత్తం 4,584 మందిని సర్వే చేసింది.

First Published:  5 Jan 2023 5:38 AM GMT
Next Story