Telugu Global
National

రైల్వే ట్రాక్ ఎత్తుకెళ్లిన దొంగలు.. పట్టాలను ఏం చేశారంటే..?

చివరకు ఓ ఇంటిలో ఆ పట్టాల ముక్కలు చూసిన అధికారులు, దొంగలకు సహకరించిన ఇద్దరు రైల్వే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అసలు దోషులకోసం వెదుకుతున్నారు.

రైల్వే ట్రాక్ ఎత్తుకెళ్లిన దొంగలు.. పట్టాలను ఏం చేశారంటే..?
X

వింతలు, విశేషాలు, విపరీత ఘటనలకు బీహార్ లో కొదవ లేదు. ఆమధ్య రిపేర్ కోసం తెచ్చిన ఓ రైలింజన్ ని సొరంగం తవ్వి మరీ ఎత్తుకెళ్లారు దొంగలు. పార్ట్ లు పార్ట్ లు గా ఊడదీసి అమ్మేసుకున్నారు. ఆ తర్వాత రెండు చోట్ల సెల్ టవర్లు సైతం చోరీ చేసుకెళ్లారు దొంగలు. ఆమధ్య వాడుకలో లేని ఓ బ్రిడ్జ్ ని కూడా దొంగలు తీసుకెళ్లారు. తాజాగా రైలు పట్టాలు ఎత్తుకెళ్లిన ఘటన కూడా బీహార్ లోనే చోటు చేసుకుంది. చాన్నాళ్లుగా వాడుకలో లేని ట్రాక్ ని ఎంపిక చేసుకుని రైలు పట్టాలను ఊడదీసుకుని వెళ్లారు. చివరకు ఓ ఇంటిలో ఆ పట్టాల ముక్కలు చూసిన అధికారులు, దొంగలకు సహకరించిన ఇద్దరు రైల్వే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అసలు దోషులకోసం వెదుకుతున్నారు.

ఎలా జరిగింది.. ?

రైలు పట్టాల దొంగతనం అంత ఆషామాషీ కాదు. పెద్ద పెద్ద మిషనరీ అవసరం. దాన్ని తరలించేందుకు కూడా శ్రమ పడాలి. కానీ బీహార్ లో ఓ రైల్వే ట్రాక్ చాన్నాళ్లుగా వాడుకలో లేదు. సమస్తిపూర్ జిల్లాలో లోహత్ షుగర్ ఫ్యాక్టరీనుంచి సరకు తీసుకెళ్లడానికి గతంలో ఓ రైల్వే లైన్ వేశారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ మూతపడటంతో ట్రాక్ కూడా వాడుకలో లేదు. ఫ్యాక్టరీకి చెందిన వస్తువుల్ని స్క్రాప్ కింద బియాడా అనే కంపెనీ కొనుగోలు చేసింది. షుగర్ ఫ్యాక్టరీలోని వస్తువుల్ని తరలిస్తోంది. ఈ క్రమంలో వారికి కూడా తెలియకుండా ట్రాక్ ని కొట్టేశారు దొంగలు.

దొంగలకు ఆర్పీఎఫ్ సిబ్బంది సహకరించారని తెలుస్తోంది. వారి సహకారంతోనే 2 కిలోమీటర్ల పొడవున్న ట్రాక్ మాయమైంది. దీంతో అవుట్ పోస్ట్ ఇన్ చార్జ్ ఒకరిని, హౌస్ కీపింగ్ అసిస్టెంట్ ని రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. కేసు విచారణ తర్వాత వారి తప్పు ఉన్నట్టు తేలితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లోహత్ చక్కెర కర్మాగారం పక్కనే ఉన్న బెలాహి అనే గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటిలో కొన్ని రైల్వే ట్రాక్‌ లను ఆర్పీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి ట్రాక్ ని ఎక్కడికి తరలించారనే విషయంపై ఆరా తీస్తున్నారు.

First Published:  6 Feb 2023 7:19 AM GMT
Next Story