Telugu Global
National

పాట్నా వేదికగా ప్రతిపక్షాల ఐక్యతా రాగం..!

సమావేశానికి హాజరైన పార్టీల మధ్య విభేదాలున్నప్పటికీ కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నామని రాహుల్‌ గాంధీ అన్నారు. దేశ పునాదులపై కేంద్రంలోని బీజేపీ దాడి చేస్తోందన్న రాహుల్‌.. ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడితే దేశాన్ని కాపాడుకోగలమన్నారు.

పాట్నా వేదికగా ప్రతిపక్షాల ఐక్యతా రాగం..!
X

2024 లోక్ సభ ఎన్నికల్లో సమైక్య పోరుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విస్తృత ప్రాతిపదికన సమైక్య ఫ్రంట్‌గా ఏర్పడేందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌పై ప్రతిపక్ష పార్టీలు చర్చలు జరిపాయి. జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్ రాజధాని పాట్నాలో 16 ప్రధాన ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకులు సమావేశమయ్యారు.

సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత‌ తేజస్వీయాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా సహా 30 మంది నాయకులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా చేయ‌డ‌మే ఏకైక అజెండాగా చర్చించారు. ప్రతిపక్షాలు ఉమ్మడి అవగాహనతో ముందుకు సాగాలని, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని నాయకులు అభిప్రాయ పడ్డారు. ఈసారి సిమ్లాలో భేటీ కావాలని ప్రతిపక్ష నేతలు నిర్ణయించారు. వచ్చే సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కలిసికట్టుగా ఎలా పోరాడాలనే అంశంపై చర్చిస్తామన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.

సమావేశానికి హాజరైన పార్టీల మధ్య విభేదాలున్నప్పటికీ కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నామని రాహుల్‌ గాంధీ అన్నారు. దేశ పునాదులపై కేంద్రంలోని బీజేపీ దాడి చేస్తోందన్న రాహుల్‌.. ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడితే దేశాన్ని కాపాడుకోగలమన్నారు.

విపక్షాలన్నీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడతాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పాట్నా నుంచే ఆ చరిత్ర ప్రారంభమైందన్న దీదీ.. ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని వినిపించడమే తమ లక్ష్యమన్నారు.

కాగా.. ప్రతిపక్షాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు. పట్నాలో ఫొటో సెషన్ నడుస్తోందని విపక్షాల భేటీని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడం అసాధ్యమన్నారు. ఒకవేళ ఏకతాటి పైకి వచ్చినా మోదీ ఆధ్వర్యంలో బీజేపీ 300 పైగా సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

ఇక విపక్షాల భేటీకి బీఆర్‌ఎస్‌ దూరంగా ఉంది. ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్ విపక్షాల భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తరుణంలో ప్రతిపక్ష పార్టీల ఐక్యత ముఖ్యంకాదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజలను ఐక్యం చేయడం ముఖ్యమన్నారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్‌తోనో, బీజేపీతోనో జట్టు కట్టడం వల్ల దేశానికి ఏ ప్రయోజనం ఉండదన్నారు.

First Published:  23 Jun 2023 1:50 PM GMT
Next Story