Telugu Global
National

కూలుతున్న వంతెనలు.. 16 మంది ఇంజినీర్లపై వేటు

అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌.. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన వాటికి తక్షణ మరమ్మతులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కూలుతున్న వంతెనలు.. 16 మంది ఇంజినీర్లపై వేటు
X

బిహార్‌లో కేవలం 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిన ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కోట్లాది రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిలు వరుసగా కూలిపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో బిహార్‌ ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 16 మంది ఇంజినీర్లను సస్పెండ్‌ చేసింది. వంతెనల నిర్మాణానికి బాధ్యులైన కాంట్రాక్టర్లను గుర్తించి వారిపైనా చర్యలు తీసుకుంటామని బిహార్‌ అభివృద్ధి కార్యదర్శి చైతన్యప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించలేదని, అదే సమయంలో ఇంజినీర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని వివరించారు.

వంతెనలు కూలిపోయిన ఘటనలపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌.. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన వాటికి తక్షణ మరమ్మతులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వంతెనల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని ఆదేశించారని డిప్యూటీ సీఎం చౌదరి వెల్లడించారు.

అవినీతి రహిత పాలన అంటే ఇదేనా?

వంతెనలు కూలిపోయిన ఘటనలపై రాష్ట్రీయ జనతాదళ్‌ నేత తేజస్వీ యాదవ్‌ స్పందిస్తూ.. అవినీతి రహిత పాలన అంటే ఇదేనా అని నిలదీశారు. జూన్‌ 18 నుంచి ఇప్పటి వరకు బిహార్‌లో 12 వంతెనలు కూలిపోయాయని, వీటిపై ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ గాని, ప్రధాని మోడీ గాని స్పందించడం లేదని విమర్శించారు. ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉన్నారని మండిపడ్డారు. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎంత ప్రబలంగా ఉందో వీటిని చూస్తే అర్థమవుతోందని ఎక్స్‌ వేదికగా విమర్శించారు.

మరోపక్క ఈ ఘటనలపై మాజీ సీఎం జితన్‌ రామ్‌ మాంఝి మాట్లాడుతూ.. ఇది రుతుపవనాల కాలం కాబట్టి అసాధారణ వర్షాలు కురుస్తున్నాయని, అందువల్లే వంతెనలు కూలుతున్నాయని చెప్పిన మాటలు ప్రజలను నివ్వెరపరుస్తున్నాయి. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  6 July 2024 1:58 AM GMT
Next Story