Telugu Global
National

బాలికపై మృగాళ్ల అఘాయిత్యం.. ట్యూషన్‌కి వెళ్లి వస్తుండగా ఘాతుకం

ఈ ఘటనపై పోలీసులు బాలికను విచారించగా, ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

బాలికపై మృగాళ్ల అఘాయిత్యం.. ట్యూషన్‌కి వెళ్లి వస్తుండగా ఘాతుకం
X

మహిళలు, బాలికలపై రోజురోజుకూ పెరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోల్‌కతా మెడికల్‌ కాలేజీలో ఓ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై నిరసనలు కొనసాగుతుండగానే.. మహారాష్ట్రలోని నర్సరీ చిన్నారులపై స్వీపర్‌ లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇంతలోనే అస్సాంలో 14 సంవత్సరాల బాలికపై ముగ్గురు మృగాళ్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అస్సాం రాష్ట్రంలోని నాగావ్‌ జిల్లాకు చెందిన ఓ బాలిక (14) ట్యూషన్‌కి వెళ్లి తిరిగి సైకిల్‌పై ఇంటికి బయలుదేరింది. మార్గంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అటకాయించి.. సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత చెరువు వద్ద వివస్త్రగా పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఘటనాస్థలికి చేరుకొని బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు బాలికను విచారించగా, ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తూ.. నిందితులను త్వరలో పట్టుకుంటామని, వారికి కచ్చితంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

First Published:  23 Aug 2024 7:56 AM GMT
Next Story