Telugu Global
National

సహాయం కోసం 8 కిలోమీటర్లు.. 2 గంటలు.. రక్తస్రావంతో అత్యాచార బాధితురాలికి నరకం

బాధిత బాలిక చివరికి ఉజ్జయినిలోని బద్ నగర్ ఏరియాలోని ఓ ఆశ్రమం వద్దకు చేరుకోగా, ఆశ్రమ నిర్వాహకులు ఆమెకు దుస్తులు ఇచ్చి సాయం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు.

సహాయం కోసం 8 కిలోమీటర్లు.. 2 గంటలు.. రక్తస్రావంతో అత్యాచార బాధితురాలికి నరకం
X

మన చుట్టూ మనుషులు ఉన్నారు సరే. కానీ వారిలో మానవత్వం మాత్రం లేదని తెలిసొచ్చేలా కొన్ని సంఘటనలు అక్కడో ఇక్కడో జరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సమీపంలో జరిగిన ఈ ఘటన అలాంటిదే. ఓ గ్రామంలో అత్యాచార బాధితురాలు గాయాలతో, తీవ్ర రక్త స్రావంతో రోడ్డుపైకి వచ్చింది. ఒంటి మీద సరైన దుస్తులు లేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలాగే తిరుగుతూ కనపడినవారినల్లా సాయం కోరింది. మతి స్థిమితం లేని ఆమెను చూడడానికి ఎగబడిన జనాల‌కు ఆమెకు రక్షణ కల్పించాలన్న కనీస జ్ఞానం లేకపోవడంతో రెండు గంటలపాటు చిరిగిన దుస్తుల‌తో రోడ్డుపైనే గడిపింది.

వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా మహాకాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకున్న బాలిక అర్ధ‌ నగ్నంగానే సాయం కోసం రోడ్డు పైకి పరుగులు పెట్టింది. ఎనిమిది కిలోమీటర్లు.. 2 గంటలపాటు కనిపించిన ప్రతి మనిషినీ సహాయం కోసం వేడుకుంది. అందరూ ఓ ప్రదర్శన చూసినట్టు చూశారే గానీ కప్పుకోవడానికి ఒక తువ్వాలు కూడా ఇవ్వలేదు. అంతే కాదు కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాధిత బాలిక చివరికి ఉజ్జయినిలోని బద్ నగర్ ఏరియాలోని ఓ ఆశ్రమం వద్దకు చేరుకోగా, ఆశ్రమ నిర్వాహకులు ఆమెకు దుస్తులు ఇచ్చి సాయం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించగా అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం అవ్వటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను ఇండోర్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక తల్లిపైనా దాడి జరిగినట్లు సమాచారం ఉందని, వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఉజ్జయిని పోలీస్ చీఫ్‌ సచిన్ శర్మ తెలిపారు.


First Published:  27 Sep 2023 10:04 AM GMT
Next Story