Telugu Global
National

మోడీ పాలన మొదలైన తర్వాత.. 11,17,086 మంది భారత పౌరసత్వాన్ని వదిలేశారు

2014లో మోడీ ప్రభుత్వ పాలన ప్రారంభించిన తర్వాత ప్రతీ ఏడాది సగటున 1.20 లక్షల మంది పౌరసత్వాన్ని వదిలేశారు. కోవిడ్ కాలంలో లాక్‌డౌన్ కారణంగా ఈ సంఖ్య కాస్త తగ్గినా.. ఆ తర్వాత పెరిగింది.

మోడీ పాలన మొదలైన తర్వాత.. 11,17,086 మంది భారత పౌరసత్వాన్ని వదిలేశారు
X

దేశంలో బీజేపీ/మోడీ పాలన మొదలైన తర్వాత అనేక మంది భారతీయులు తమ పౌరసత్వాలను వదిలేసుకున్నారు. దేశంలో ఉన్న పరిస్థితులు, భవిష్యత్‌పై ఆందోళన కారణంగా విదేశాల్లో స్థిరపడటానికి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడేళ్లలో ఏకంగా 11,17,086 మంది ఇండియన్ సిటిజన్‌షిప్‌ను వద్దనుకున్నారు. ఇవి ఆషామాషీగా ఎవరో చెప్పిన లెక్కలు కావు. స్వయంగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ పార్లమెంటులో చెప్పిన గణాంకాలే.

గత ఎనిమిదేళ్ల కాలంలో చాలా మంది పౌరసత్వాన్ని త్యజించడానికి సిద్ధ పడ్డారు. 2017లో 1,33,049 మంది పౌరసత్వాన్ని వదులుకుంటే.. ఈ ఏడాది అక్టోబర్ నాటికే 1,83,741 మంది సిటిజన్‌షిప్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. 2014లో మోడీ ప్రభుత్వ పాలన ప్రారంభించిన తర్వాత ప్రతీ ఏడాది సగటున 1.20 లక్షల మంది పౌరసత్వాన్ని వదిలేశారు. కోవిడ్ కాలంలో లాక్‌డౌన్ కారణంగా ఈ సంఖ్య కాస్త తగ్గినా.. ఆ తర్వాత పెరిగింది.

పార్లమెంటులో ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది, 2022 (అక్టోబర్ వరకు) 1,83,741 మంది తమకు ఉన్న భారత పౌరసత్వాన్ని వదిలేసినట్లు లిఖిత పూర్వకంగా తెలియజేశారు.

ఇక భారత పౌరసత్వాన్ని పొందిన విదేశీయుల సంఖ్యలను కూడా పార్లమెంటుతో తెలియజేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌కు చెందిన పౌరులు కాకుండా.. ఇతర దేశాలకు చెందిన 792 మంది ఇండియన్ సిటిజస్‌షిప్ స్వీకరించారు. 2015లో 93 మంది, 2016లో 153 మంది, 2017లో 175 మంది, 2018లో 129 మంది, 2019లో 113 మంది, 2020లో 27 మంది, 2021లో 42 మంది, 2022లో ఇప్పటి వరకు 60 మంది భారత పౌరసత్వాన్ని తీసుకున్నారు.

First Published:  9 Dec 2022 6:45 PM GMT
Next Story