Telugu Global
National

బస్సును ఢీకొట్టిన ట్రైలర్.. 11 మంది మృతి, 15మందికి తీవ్ర గాయాలు

ప్రమాద ఘటన తెలిసిన వెంటనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ స్పందించారు. రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బస్సును ఢీకొట్టిన ట్రైలర్.. 11 మంది మృతి, 15మందికి తీవ్ర గాయాలు
X

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న బస్సును ఒక ట్రైలర్ ఢీకొనడంతో 11 మంది చనిపోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది. భరత్‌పూర్ జిల్లా హంత్రాకు సమీపంలో బుధవారం ఉదయం 4.30 గంటల ప్రాంతంలో ఫ్లై వోవర్‌పై నిలిచిపోయిన ఒక బస్సును వెనుక నుండి వేగంగా వచ్చిన ట్రైలర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 15 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

రాజస్థాన్‌లోని భావ్‌నగర్ నుంచి యూపీలోని మథురకు వెళ్తున్న బస్సు.. బుధవారం తెల్లవారు జామున లఖ్నాపూర్ చేరుకున్నది. అక్కడ ఫ్లైవోవర్‌పై చిన్న సమస్యతో బస్సును ఆపేసి.. డ్రైవర్ పరిశీలిస్తూ ఉన్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ట్రైలర్.. బస్సు ఆగి ఉన్న విషయాన్ని గమనించకుండా వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు.

చనిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా, ప్రమాద ఘటన తెలిసిన వెంటనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ స్పందించారు. రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు తన సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

First Published:  13 Sep 2023 4:15 AM GMT
Next Story