Telugu Global
NEWS

కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డులకు ఎంపికైన మ‌న తెలుగు తేజాలు

మ‌ధురాంత‌కం న‌రేంద్ర‌, వారాల ఆనంద్ ఈ పుర‌స్కారాల‌కు ఎంపిక‌య్యారు. త‌ద్వారా మ‌న తెలుగు వారి కీర్తి ప‌తాక‌ను దేశ‌వ్యాప్తంగా ఎగుర‌వేశారు.

కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డులకు ఎంపికైన మ‌న తెలుగు తేజాలు
X

కేంద్ర సాహిత్య అకాడ‌మీ 2022 సంవ‌త్స‌రానికి ప్ర‌క‌టించిన పుర‌స్కారాల్లో ఇద్ద‌రు తెలుగు ర‌చ‌యిత‌లు చోటు ద‌క్కించుకున్నారు. మ‌ధురాంత‌కం న‌రేంద్ర‌, వారాల ఆనంద్ ఈ పుర‌స్కారాల‌కు ఎంపిక‌య్యారు. త‌ద్వారా మ‌న తెలుగు వారి కీర్తి ప‌తాక‌ను దేశ‌వ్యాప్తంగా ఎగుర‌వేశారు. జీవితంలో ప్ర‌జాస్వామిక దృక్ప‌థం ఎంతో అవ‌స‌ర‌మ‌ని న‌మ్మే క‌థా ర‌చ‌యిత‌ల్లో ఒక‌రు మ‌ధురాంత‌కం న‌రేంద్ర‌. ఆయ‌న ర‌చించిన `మ‌నోధ‌ర్మ ప‌రాగం` న‌వ‌ల‌కు ఈ పుర‌స్కారం ల‌భించింది. అలాగే అనువాద విభాగంలో వారాల ఆనంద్ రాసిన `ఆకుప‌చ్చ క‌విత‌లు` పుస్త‌కం అనువాద పుర‌స్కారానికి ఎంపికైంది. పుర‌స్కారాల‌కు ఎంపికైన వీరిద్ద‌రినీ త్వ‌ర‌లో ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు, జ్ఞాపిక‌ల‌తో స‌త్క‌రించ‌నున్నారు. మొత్తం 23 భాష‌ల సాహితీవేత్త‌ల‌ను పుర‌స్కారాల‌కు ఎంపిక చేసిన‌ట్టు అకాడ‌మీ కార్య‌ద‌ర్శి శ్రీ‌నివాస‌రావు గురువారం ఢిల్లీలో ప్ర‌క‌టించారు.

సామాజిక అంశాలే ఆయ‌న క‌థా వ‌స్తువు..

సామాజిక అంశాలే క‌థా వ‌స్తువులుగా, సీమ వేష‌భాష‌లే ప్రాతిప‌దిక‌గా పాత్ర‌ల తీరుతెన్నులతో మ‌ధురాంత‌కం న‌రేంద్ర ర‌చ‌న‌లు ఉంటాయి. జ‌న వాస్త‌విక దృక్ప‌థ‌మే ఆలంబ‌న‌గా ఆయ‌న ర‌చ‌న‌లు చేస్తుంటారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవుల జీవ‌న విశేషాల‌కు ఆయ‌న ర‌చ‌న‌లు ద‌ర్ప‌ణం ప‌డ‌తాయి. 1957 జూలై 16న తిరుప‌తి జిల్లా పాకాల మండ‌లంలోని ర‌మ‌ణ‌య్య‌గారి ప‌ల్లెలో నాగ‌భూష‌ణ‌మ్మ‌, మ‌ధురాంత‌కం రాజారాం దంప‌తుల‌కు న‌రేంద్ర జ‌న్మించారు. ప్ర‌స్తుతం తిరుప‌తి ప‌ద్మావ‌తి న‌గ‌ర్‌లో ఆయ‌న నివాస‌ముంటున్నారు. ఎంఏ ఇంగ్లిష్ లిట‌రేచ‌ర్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేసిన న‌రేంద్ర ఎస్‌వీ యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌కి ప్రిన్సిపాల్‌గా ప‌నిచేశారు. ఎస్వీయూ ఇంగ్లిష్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేసి ప‌దవీ విర‌మ‌ణ చేశారు.

తండ్రి వార‌సత్వాన్ని పుణికిపుచ్చుకొని..

మ‌ధురాంత‌కం న‌రేంద్ర తండ్రి మ‌ధురాంత‌కం రాజారాం సాహిత్య ఘ‌నాపాటి. కథ‌లు, న‌వ‌ల‌లు, నాట‌కాలు, గేయాలు ర‌చించిన సుప్ర‌సిద్ధ ర‌చ‌యిత‌. సాహిత్య‌మే ఊపిరిగా జీవించిన ఆయ‌న గ‌తంలో సాహిత్య అకాడ‌మీ పుర‌స్కారం అందుకున్నారు. బ్రిటీష్ పాల‌కులు వ‌చ్చిన త‌ర్వాత దేవదాసీల ఈనాం భూములను ర‌ద్దు చేయ‌డంతో వారి జీవితాల్లో వ‌చ్చిన మార్పులు, దేవ‌దాసీల మ‌నోగ‌తాన్ని న‌రేంద్ర త‌న న‌వ‌ల `మ‌నోధ‌ర్మ ప‌రాగం`లో వివ‌రించారు. ఈ న‌వ‌ల‌కు గ‌తంలో `ఆటా` బ‌హుమ‌తి కూడా ద‌క్కింది. 14 తెలుగు, 12 ఆంగ్ల ర‌చ‌న‌లు చేసిన నరేంద్ర ప‌లు పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం కూడా వ‌హించారు.

బ‌హుముఖ ప్ర‌జ్ఞావంతుడు వారాల ఆనంద్‌..

క‌విత్వం, వ‌చ‌నం, సినిమా స‌మీక్ష‌లు, వ్యాసాలు, డాక్యుమెంట‌రీ చిత్రాలు, తెలుగు, ఆంగ్ల ర‌చ‌న‌ల‌తో పాటు అనువాద ర‌చ‌న‌ల‌తో వారాల ఆనంద్ బ‌హుముఖ ప్ర‌జ్ఞావంతునిగా గుర్తింపు పొందారు. క‌రీంన‌గ‌ర్‌కు చెందిన ఆయ‌న ప్ర‌ముఖ క‌వి, ప‌ద్మ‌భూష‌ణ్ గుల్జార్ రాసిన `గ్రీన్ పోయెమ్స్‌` ను 2019లో తెలుగులోకి అనువదించారు. `ఆకుప‌చ్చ క‌విత‌లు` పేరుతో అనువదించిన ఈ పుస్త‌కంలో ప్ర‌కృతికి సంబంధించిన 58 క‌విత‌లు ఉన్నాయి. ఆనంద్ డిగ్రీ చ‌దువుతున్న స‌మ‌యం నుంచే త‌న సాహితీ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ, త‌త్వ‌శాస్త్రం, లైబ్ర‌రీ సైన్స్ పూర్తిచేశారు. ప‌లు జూనియ‌ర్, డిగ్రీ క‌ళాశాల‌ల్లో లైబ్రేరియ‌న్‌గా ప‌నిచేసి రిటైర‌య్యారు.

Next Story