Telugu Global
NEWS

లేత‌గా.. బూడిద రంగులో చెమ‌ట‌ క‌నిపిస్తే.. గుండెపోటు రాబోతోంద‌ని సంకేతం..!

ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన బరువు, అలాగే ఆరోగ్యకరమైన గుండె, రోగనిరోధక వ్యవస్థల కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.

లేత‌గా.. బూడిద రంగులో చెమ‌ట‌ క‌నిపిస్తే.. గుండెపోటు రాబోతోంద‌ని సంకేతం..!
X

గుండెపోటు విష‌యంలో స‌ర్వ సాధార‌ణ ల‌క్ష‌ణం ఛాతీ నొప్పి. అయినా ఇదొక్క‌టే గుండెపోటుకు సంకేతం కాక‌పోవ‌చ్చు. గుండెపోటును ఎదుర్కొనే కొంత‌మందిలో ఛాతీ నొప్పి కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. ఇంత‌కు ముందు వారికి ఉన్న వైద్య ప‌రిస్థితుల నేప‌థ్యంలో గుండెపోటు రాబోతోంద‌ని హెచ్చ‌రించే కొన్ని అంత‌గా తెలియ‌ని సంకేతాలు కూడా ఉంటాయ‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు.

ఛాతీ నొప్పి కాకుండా ఇతర సంకేతాలు ఇలా..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండెపోటుకు ముందు ఒక వ్యక్తి లేతగా, బూడిద రంగులో చెమటతో కనిపించవచ్చు. వికారంగా కూడా అనిపించవచ్చు. శ్వాస స‌రిప‌డినంత తీసుకోని ప‌రిస్థితి ఉండ‌వ‌చ్చు. ఒక్కొక్క‌రికి చాలా ఆత్రుత, మైకం కూడా అనిపించవచ్చు.

పురుషులు, స్త్రీల‌లో సాధారణ సంకేతాలివీ..

గుండెపోటు విషయంలో పురుషులు ప్రధానంగా ఛాతీ నొప్పిని అనుభవిస్తారని నిపుణులు కనుగొన్నారు. స్త్రీల విష‌యంలో సాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. అనారోగ్యం.. మెడ, దవడలో నొప్పిని అనుభవించడం వంటి అదనపు లక్షణాలు ఉండ‌వ‌చ్చు.

షుగ‌ర్ ఉంటే.. నిశ్శబ్ద గుండెపోటుకు అవ‌కాశం..

మధుమేహం ఉన్న‌వారిలో గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. వారు గుర్తించ‌గ‌లిగే హెచ్చ‌రిక సంకేతాల‌ను అనుభ‌వించ‌క‌పోవ‌చ్చు. అంటే అలాంటివారు నిశ్శ‌బ్ద గుండెపోటుకు గుర‌య్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. గుండెపోటుతో బాధపడుతున్న టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తి గుండెల్లో తేలిక‌పాటి మంట‌, ఛాతీ నొప్పి వంటి ల‌క్ష‌ణాల‌ను అనుభ‌వించ‌వ‌చ్చు. ఎలాంటి కార‌ణం లేకుండా చ‌ల్ల‌గా చెమ‌ట ప‌ట్టొచ్చు. ద‌వ‌డ‌, మెడ‌, ఎడ‌మ చేతిలో నొప్పిని అనుభ‌వించ‌వ‌చ్చు. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ గుండెపోటుకు సంబంధించిన హెచ్చ‌రిక సంకేతాలుగానే భావించాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీ ప్రమాదాన్ని తగ్గించడానికి..

ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన బరువు, అలాగే ఆరోగ్యకరమైన గుండె, రోగనిరోధక వ్యవస్థల కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. పండ్లు, కూరగాయలు, విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు సమృద్ధిగా ఉండే పండ్లను పుష్కలంగా తినాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవ‌డం.. గుండెపోటు ప్ర‌మాదాన్ని త‌గ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌, టైప్‌-2 డ‌యాబెటిస్‌, హై బీపీ వంటి ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తుంది.

రోజువారీ వ‌ర్క‌వుట్లు అవసరం

ప్రతిరోజూ జిమ్‌లో వర్కవుట్ చేయకపోయినా, ఏదోక ర‌కంగా ప్ర‌తిరోజూ శారీర‌క శ్ర‌మ చేయ‌డం మాత్రం అవ‌స‌ర‌మ‌ని గుర్తించాలి. రోజులో ఎక్కువ గంట‌లు కూర్చోకుండా ఉండేలా చూసుకోవాలి. సాధార‌ణంగా ప్ర‌తిరోజూ 30 నుంచి 60 నిమిషాల వ‌ర్క‌వుట్లు అనువైన‌వి. ఇవి ఒకేసారి ఉండ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. చురుగ్గా న‌డ‌వ‌డం, కొన్ని శ్ర‌మ‌తో కూడిన ఇంటి ప‌నులు చేయ‌డం కూడా మంచిదే. ఏదోక రూపంలో క‌ద‌లుతూ ఉండ‌ట‌మే కీల‌కం.

First Published:  17 Jan 2023 7:50 AM GMT
Next Story