Telugu Global
NEWS

కేసీఆర్ జాతీయ పార్టీ.. వైఎస్ జగన్ కలయికపై ఆసక్తికరమైన చర్చ

తాజాగా టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ కూడా కేసీఆర్ వెంట నడుస్తారని ఆయన అన్నారు. అలా అనడం వెనుక ఆంత్యర్యం ఏమిటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేసీఆర్ జాతీయ పార్టీ.. వైఎస్ జగన్ కలయికపై ఆసక్తికరమైన చర్చ
X

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో కూటమి కంటే పార్టీ ఏర్పాటే కలిసి వస్తుందనే విషయాన్ని ఇప్పటికే కేసీఆర్ వెల్లడించారు. దసరా లోపు ఈ పార్టీపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్.. జాతీయ పార్టీ, అందులో తన పాత్రపై ప్రజలకు వివరించారు. ఇక టీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుతున్నట్లు చెబుతున్నారు. కంట్రీ మొత్తం కేసీఆర్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తోందని అంటున్నారు.

ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సానుకూలంగా స్పందించారు. తాజాగా కుమారస్వామి కూడా దేశానికి కేసీఆర్ అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అవసరమైనప్పుడు ఎంకే స్టాలిన్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ కూడా కేసీఆర్‌తో కలసి వస్తారని భావిస్తున్నారు. కానీ, మరో తెలుగు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ఎటువైపు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి జగన్.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో కలసి అడుగులు వేస్తున్నారు. పలుమార్లు ఆ ప్రభుత్వానికి పార్లమెంటులో బేషరతుగా మద్దతు కూడా ప్రకటించారు. కేసీఆర్ కూడా ఎప్పుడూ వైఎస్ జగన్, వైసీపీ ఊసే ఎత్తలేదు.

తాజాగా టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ కూడా కేసీఆర్ వెంట నడుస్తారని ఆయన అన్నారు. అలా అనడం వెనుక ఆంత్యర్యం ఏమిటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి కేసీఆర్-వైఎస్ జగన్ మధ్య మొదటి నుంచి సత్సంబంధాలే ఉన్నాయి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనను కేసీఆర్ వెనకేసుకొని వచ్చారు. సీఎం అయ్యాక జగన్.. ఏకంగా ప్రగతి భవన్ వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం విభేదించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాలు, కృష్ణా జలాల్లో వాటా, విభజన చట్టంలోని హామీలు, తాజాగా విద్యుత్ బకాయిల విషయంలో ఇరు ప్రభుత్వాల మధ్య విభేదాలు నెలకొన్నాయి.

వైఎస్ జగన్ ఏనాడూ తెలంగాణతో ఈ విషయాలను చర్చించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం పలుమార్లు లేఖలు రాశారు. అదే సమయంలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలసి వినతిపత్రాలు అందించారు. తాజాగా కేసీఆర్ మాత్రం ఏపీనే తెలంగాణకు బకాయి పడిందని లెక్కలతో సహా తెలంగాణ అసెంబ్లీలో వివరించారు. కానీ, ఆ సమయంలో వైఎస్ జగన్ పేరు తీయలేదు. రాజకీయంగా టీఆర్ఎస్-వైసీపీ ఏనాడూ విభేదించుకోలేదు. కేవలం బీజేపీ విషయంలోనే టీఆర్ఎస్ వ్యతిరేక స్టాండ్ తీసుకోగా, వైసీపీ మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే వైసీపీ కూడా బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే భవిష్యత్‌లో వైఎస్ జగన్ కూడా కేసీఆర్ పార్టీతో కలసి వస్తారని గంగుల వ్యాఖ్యానించినట్లు చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా ఇరు పార్టీలను కలపడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. జగన్.. బీజేపీకి సహకరించడం కేవలం తాత్కాలికమేనని.. ఒకసారి కేసీఆర్ పార్టీ ప్రకటన చేశాక.. ఆయన కూడా చేతులు కలపడం ఖాయమేననే చర్చ జరుగుతుంది.

ఇరు రాష్ట్రాలు కలిస్తే తప్పకుండా ఏపీకీ ప్రత్యేక హోదా వస్తుందని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో కలవడంలో తప్పులేదని, ఆయన ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించారని గత ఎన్నికల ప్రచారంలో జగన్ కూడా అన్నారు. తాజాగా గంగుల వ్యాఖ్యలతో వీరి కలయికకు ఎంతో సమయం లేదని, త్వరలోనే ఒకే వేదికపైకి వస్తారని అనుకుంటున్నారు. వైసీపీ కనుక టీఆర్ఎస్‌తో జతకడితే కేంద్రంలోని బీజేపీకి తిప్పలు తప్పవని అంటున్నారు. దక్షిణాదిలో ఉన్న బలమైన పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీకి బలమైన కూటమిగా మారుతుందని, కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగే అంత బలం కూడా వస్తుందని విశ్లేషిస్తున్నారు. పీకే కూడా ఇదే స్ట్రాటజీని గతంలో కేసీఆర్‌కు చెప్పారని.. ఇప్పుడు అదే అమలు చేస్తున్నట్లుగా కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఎన్నికల నాటికి కేసీఆర్-వైఎస్ జగన్ కలిస్తే.. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం తప్పకుండా వస్తుంది.

First Published:  12 Sep 2022 11:29 AM GMT
Next Story