Telugu Global
National

ఆదిత్య ఎల్‌-1 సెల్ఫీ.. ఒకే ఫ్రేమ్‌లో చంద్రుడు, భూమి

సెప్టెంబర్‌ 4న ఆదిత్య ఎల్‌-1 ఈ సెల్ఫీ తీసినట్లు ఇస్రో వివరించింది. ఈ సెల్ఫీలో ఆదిత్య-ఎల్‌ 1 శాటిలైట్‌లోని విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌, సోలార్‌ ఆల్ట్రావయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ కన్పించాయి.

ఆదిత్య ఎల్‌-1 సెల్ఫీ.. ఒకే ఫ్రేమ్‌లో చంద్రుడు, భూమి
X

సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య -ఎల్‌ 1 ప్రయోగం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. లాగ్రెంజ్‌ పాయింట్‌ వైపు పయనిస్తున్న ఆదిత్య .. తాజాగా సెల్ఫీలను తీసి పంపింది. అలాగే భూమి, చంద్రుడిని ఒకే ఫ్రేమ్‌లో బంధించింది. ఈ అద్భుత దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. సెప్టెంబర్‌ 4న ఆదిత్య ఎల్‌-1 ఈ సెల్ఫీ తీసినట్లు ఇస్రో వివరించింది. ఈ సెల్ఫీలో ఆదిత్య-ఎల్‌ 1 శాటిలైట్‌లోని విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌, సోలార్‌ ఆల్ట్రావయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ కన్పించాయి. దీంతో పాటు భూమి, చంద్రుడు ఒకే ఫ్రేమ్‌లో కన్పించిన దృశ్యాలను కూడా ఆదిత్య-ఎల్‌ 1 క్లిక్‌మనిపించింది. ఈ దృశ్యాలను వీడియో రూపంలో సోషల్‌ మీడియాలో ఇస్రో షేర్ చేసింది.

ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌లోని ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌..సూర్యుడి కరోనా, స్పెక్ట్రోస్కోపిని స్టడీ చేస్తుంది. ఇక సోలార్‌ ఆల్ట్రావయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌..ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌ను పరిశీలిస్తుంది. సెప్టెంబరు 2న ఇస్రో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. ఇప్పటికే రెండు సార్లు భూ కక్ష్య పెంపు ప్రక్రియను సక్సెస్‌ఫుల్‌గా చేపట్టారు. సెప్టెంబర్‌ 10న మరోసారి కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టనున్నారు.

ఆదిత్య - ఎల్‌1 శాటిలైట్‌ దాదాపు 125 రోజుల పాటు ప్రయాణించి..లాగ్రెంజ్‌ పాయింట్‌ను చేరుకుంటుంది. ఈ పాయింట్‌ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిని అధ్యయనం చేసేందుకు వీలుంటుంది. ఇందులో ఏడు రకాల పేలోడ్స్‌ ఉన్నాయి, ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమోస్పియర్‌తో పాటు కరోనాను కూడా అధ్యయనం చేస్తాయి. ఈ అధ్యయనం వల్ల సౌర తుపానుల నుంచి అంతరిక్షంలోని ఉపగ్రహాలు, ఇతర పరిశోధనాశాలలను కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఆగస్టు చివరి వారంలో చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్‌-3 ల్యాండర్‌ అడుగుపెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా ఇండియా ఇప్పటికే రికార్డు సొంతం చేసుకుంది. ఇక రాబోయే రోజుల్లో మానవ అంతరిక్ష యాత్ర ప్రయోగాన్ని కూడా చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. 2025 నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే టార్గెట్‌తో ఇస్రో పని చేస్తుందన్నారు.

First Published:  7 Sep 2023 9:42 AM GMT
Next Story