Telugu Global
NEWS

Kompally-Medchal-Shamitpet | కొంపల్లి- మేడ్చల్ - శామీర్ పేట కారిడార్ పై ఇన్వెస్టర్ల మోజు..!

ఇన్వెస్టర్లు, సెలబ్రిటీలు, రియాల్టీ సంస్థలు, వైద్య ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు, వ్యాపారులు కొంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు.

Kompally-Medchal-Shamitpet | కొంపల్లి- మేడ్చల్ - శామీర్ పేట కారిడార్ పై ఇన్వెస్టర్ల మోజు..!
X

Kompally-Medchal-Shamitpet | ఐటీ మొదలు ఫార్మా నుంచి మెడికల్ వరకూ పలు రంగాలకు కేంద్రంగా విలసిల్లుతోంది హైదరాబాద్. శాంతి భద్రతలు, భౌగోళికంగా.. వాతావరణ పరంగా సమతుల్య ఉష్ణోగ్రతతో అలరారుతోంది భాగ్య నగరం. భద్రతా పరంగా సురక్షిత పరిస్థితులు, మౌలిక వసతుల కల్పనలో సర్కార్ పాజిటివ్ దృక్పథం, మెరికల్లాంటి వృత్తి నిపుణులు, మెరుగైన ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్యా అవకాశాలు.. మెరుగైన వైద్య ఆరోగ్య వసతులు.. ప్రతి రంగంలోనూ అందరికీ.. ప్రత్యేకించి ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నది.

ఇప్పటికే హైటెక్ సిటీ నుంచి సంగారెడ్డి వరకూ ఐటీ కంపెనీలు కొలువుదీరాయి. తాజాగా కొంపల్లి ప్రాంతంలో ఐటీ, లాజిస్టిక్ తదితర కంపెనీలు విస్తరిస్తుండటంతో ఇన్వెస్టర్లకు కొంపల్లి-మేడ్చల్ - శామీర్ పేట ఇన్వెస్ట్‌మెంట్ కారిడార్.. మదుపరులకు అత్యంత ఆకర్షణీయంగా మారింది. అందుకే దేశంలోని ఐదు ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ కారిడార్లలో ఒకటిగా నిలిచిందని ప్రముఖ రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ కొల్లీర్స్ ఇండియా పేర్కొంది.

ఇన్వెస్టర్లు, సెలబ్రిటీలు, రియాల్టీ సంస్థలు, వైద్య ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు, వ్యాపారులు కొంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు.

ఇలా సొంతం చేసుకున్న స్థిరాస్తులను సెకండ్ హోమ్స్, వీకెండ్ హోమ్స్, హాలీ డే హోమ్స్, రిటైర్మెంట్ హోమ్స్ గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. తద్వారా వీటిపై స్థిరమైన అద్దె ఆదాయం అందుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇలా కొంపల్లి కారిడార్ ప్రాంతంలో పెట్టే పెట్టుబడులపై వచ్చే పదేళ్లలో మూడు రెట్ల రిటర్న్స్ లభిస్తాయని కోల్లీర్స్ ఇండియా అంచనా వేసింది.

కొంపల్లి - మేడ్చల్ - శామీర్ పేటతో పాటు మహారాష్ట్రలోని నేరల్ - మాతేరాన్, గుజరాత్ లోని సనంద్- నాల్ సరోవర్, కోల్ కతా సమీప న్యూ టౌన్ - రాజార్ హాట్, చెన్నై శివారులోని ఈస్ట్ కోస్ట్ రోడ్ (ఈసీఆర్) - ఇంజాంబాకం - కోవళం ప్రాంతాలు దేశంలోనే సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ కారిడార్‌లుగా అవతరించాయి.

వచ్చే దశాబ్ద కాలంలో కొంపల్లి - మేడ్చల్ - శామీర్ పేట కారిడార్ పరిధిలో మూడు రెట్లు రిటర్న్స్ లభిస్తే.. గరిష్టంగా మహారాష్ట్ర నేరల్ - మాతేరాన్ కారిడార్‌పై పెట్టుబడులు ఐదు రెట్లు రిటర్న్స్ అందిస్తుందని కొల్లీర్స్ ఇండియా నివేదిక పేర్కొంది. గుజరాత్‌లోని సనంద్ - నాల్ సరోవర్, చెన్నై ఈస్ట్ కోస్ట్ కారిడార్ 3.5 రెట్లు, కోల్‌కతా శివారులోని న్యూటౌన్ - రాజర్ హాట్ కారిడార్ 2.5 రెట్లు రిటర్న్స్ ఇస్తుందని తెలిపింది కోల్లీర్స్ ఇండియా.

' భూములపై పెట్టే పెట్టుబడులు భవిష్యత్‌లో బంగారు గనులవుతాయి. కొనుగోలు చేసిన భూములను అభివృద్ధి చేయడంతో వచ్చే రిటర్న్స్.. ఇన్వెస్టర్లకు లాభాలు చేకూరుస్తాయి ' అని టాప్ ఇన్వెస్ట్‌మెంట్ కారిడార్స్ ఇండియా ' నివేదికలో వెల్లడించింది కొల్లీర్స్ ఇండియా. మున్ముందు ఆవిర్భవించే మైక్రో మార్కెట్లు, కారిడార్లపై పెట్టే పెట్టుబడులను ఇన్వెస్టర్ల ఆర్థిక వృద్ధి దిశగా మళ్ళించడానికి రియాల్టీ కన్సల్టెంట్స్ సహకరిస్తారని తెలిపింది కొల్లీర్స్ ఇండియా.

'దేశంలోని ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు, మెట్రో పాలిటన్ నగరాల్లో విల్లాలు, ఫామ్ హౌస్ లు, లగ్జరీ ఇళ్ల‌ కోసం గిరాకీ పెరుగుతోంది. కొవిడ్-19 తర్వాత విల్లాలు, ఫామ్ హౌస్‌లకు రెండు రెట్లు గిరాకీ పెరిగింది' అని కొల్లీర్స్ ఇండియా డెలివరీ- అడ్వైజరీ సర్వీసెస్ హెడ్, సీనియర్ డైరెక్టర్ వై ఉమాకాంత్ పేర్కొన్నారు. రెడీ అపార్ట్ మెంట్లకంటే భూములపై పెట్టుబడులు, రెంటల్ ఫార్మాట్ ఆస్తులపై ఇన్వెస్ట్మెంట్ 10 రెట్లు రిటర్న్స్ ఇస్తుందన్నారాయన.

కస్టమర్ల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా స్థిరాస్తులపై పెట్టుబడులు వృద్ధికి, బహుళ రూపాల్లో సంపద సృష్టించవచ్చు అని కోల్లీర్స్ ఇండియా పేర్కొంది. స్థిరాస్తులను బట్టి నిర్వహించే వ్యాపార లావాదేవీలపై లాభాలు ఉంటాయి. అద్దె ఆధారిత ఆస్తుల నిర్మాణంతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు ఆదాయం సంపాదిస్తారనీ ఉమాకాంత్ పేర్కొన్నారు.

First Published:  21 Sep 2023 8:52 AM GMT
Next Story