Telugu Global
International

మహిళా హక్కులు ముఖ్యంకాదు,షరియా చట్టమే ప్రధానం - స్పష్టం చేసిన తాలిబన్లు

దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని నిరసనలొచ్చినా , ఎంత వ్యతిరేకత వ్యక్తమైనా తాలిబన్ లు తమ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గడంలేదు. మహిళలపై ఆంక్షలను రద్దు చేయబోమని తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ నిన్న ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

మహిళా హక్కులు ముఖ్యంకాదు,షరియా చట్టమే ప్రధానం - స్పష్టం చేసిన తాలిబన్లు
X

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడి ప్రజలను అనేక రకాలుగా అణిచివేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు పూర్తిగా స్వేచ్చను కోల్పోయారు. మహిళలు విశ్వవిద్యాలయాల్లో చదవడాన్ని, ప్రభుత్వేతర సంస్థలలో (ఎన్‌జిఓ) పని చేయడాన్ని తాలిబన్ లు నిషేధించారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవడాన్ని కూడా నిషేధించారు. దీనిపై ఆఫ్ఘనిస్తాన్ సహా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వచ్చాయి. మహిళలపై నిషేధాలను ఎత్తివేయాలని డిమాండ్లు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని అనేక ప్రాంతాలలో మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థులు, మహిళా కార్యకర్తల నిరసనలకు దిగారు.

యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, యూరోపియన్ యూనియన్ (EU), ఐక్యరాజ్యసమితి (UN), ముస్లిం దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫిస్లామిక్ కోఆపరేషన్( OIC), ఇతర అంతర్జాతీయ సహాయ సంస్థలతో సహా కొన్ని విదేశీ ప్రభుత్వాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని తాలిబాన్ ప్రభుత్వాన్ని కోరాయి.

అయితే దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని నిరసనలొచ్చినా , ఎంత వ్యతిరేకత వ్యక్తమైనా తాలిబన్ లు తమ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గడంలేదు. మహిళలపై ఆంక్షలను రద్దు చేయబోమని తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ నిన్న ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించే ఏ చర్యను అనుమతించబోమని, మహిళల హక్కులపై ఆంక్షలకు వ్యతిరేకంగా దేశంలో సాగుతున్న ఆందోళనలను మా నియమాల ప్రకారం పరిష్కరించుకుంటామని తాలిబాన్ తెలిపింది.

తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ఒక ప్రకటనలో, "ఇస్లామిక్ ఎమిరేట్ ఇస్లామిక్ షరియాకు అనుగుణంగా అన్ని విషయాలను నియంత్రిస్తుంది. దేశంలో షరియాకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవడాన్ని కూడా మా ప్రభుత్వం అనుమతించదు" అని తెలిపారని ఖమా ప్రెస్ నివేదించింది.

మరో వైపు మహిళలపై నిషేదాన్ని ఎత్తి వేయక పోతే ఆఫ్ఘనిస్తాన్ కు అందించే సహాయాన్ని అందించబోమని, పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు స్పష్టం చేసిన నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధి

జబివుల్లా ముజాహిద్ తన ప్రకటనలో, ''ఆఫ్ఘనిస్తాన్‌లోని మతపరమైన డిమాండ్‌లను అర్థం చేసుకోవాలి. రాజకీయాలకు మానవతావాద సహాయాన్ని ముడిపెట్టకుండా ఉండాలి'' అని ఆఫ్ఘనిస్తాన్ భాగస్వాములు, అంతర్జాతీయ సహాయ సంస్థలను కోరినట్లు ఖామా ప్రెస్ నివేదించింది.

కాగా ,ఆఫ్ఘన్ మహిళలు, బాలికలపై తాము ప్రవర్తించే విధానం ఇస్లాం షరియా చట్టానికి అనుగుణంగా ఉందని తాలిబాన్ లు చేస్తున్న వాదనను అన్ని ముస్లిం-మెజారిటీ దేశాలతో కూడిన ఇంటర్‌గవర్నమెంటల్ గ్రూప్, ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC) తిరస్కరించినట్లు ఖామా ప్రెస్ నివేదించింది.

లింగ ఆధారిత పరిమితులను తొలగించాలని, ఆఫ్ఘన్ మహిళలు, బాలికలకు సహజమైన ప్రాథమిక హక్కులు కల్పించాలని, విద్య, పని, బహిరంగంగా కనిపించడం వంటి వాటికి అనుమతించాలని OIC తాలిబాన్ అధికారులను కోరింది.

First Published:  16 Jan 2023 2:13 AM GMT
Next Story