Telugu Global
International

కరోనా పని అయిపోయినట్టే..! WHO కీలక ప్రకటన..

ప్రస్తుతం కరోనా వైరస్ జాడ కనిపిస్తున్నా అది సాధారణ జలుబులా మారిపోయింది. వైరస్ బలహీన పడటంతోపాటు, మన శరీరాలు దానికి పూర్తిగా అలవాటు పడ్డాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

కరోనా పని అయిపోయినట్టే..! WHO కీలక ప్రకటన..
X

కరోనా కథ ముగిసినట్టేనా..? కేసుల సంఖ్య తక్కువగా ఉన్నంత మాత్రాన కరోనా మహమ్మారి భయం తగ్గినట్టేనా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాత్రం ఈమేరకు భరోసా ఇస్తోంది. కరోనా కథ ముగిసినట్టేనని చెబుతోంది. అయితే వైరస్ పూర్తిగా అంతమైపోయిందని మాత్రం చెప్పడంలేదు. కేసుల సంఖ్య అక్కడక్కడా ఉన్నా కూడా ఇక కరోనా విజృంభణ అనేది మాత్రం ఉండదట. కొత్త వేవ్ ముంచుకొస్తోంది అనే హెచ్చరికలు కూడా ఇకపై వినపడవని చెబుతున్నారు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్.

ఆ శకం ముగిసింది..

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం వణికిపోయిన దశ ఇప్పుడు పూర్తిగా ముగిసిపోయినట్టేనని చెబుతున్నారు టెడ్రోస్. వైరస్‌ వెలుగులోకి వచ్చిన రెండున్నరేళ్లకు ఆ మహమ్మారి తోకముడిచే రోజులు వచ్చేశాయని చెబుతున్నారాయన. ఇకపై కేసుల పెరుగుదల అంతగా ఉండదని అన్నారు. అదే సమయంలో జీరో కేసుల స్థాయికి చేరుకుంటామని ఇప్పుడే చెప్పలేమని, దానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. రెండున్నరేళ్లుగా చీకటి గుహలో బతుకుతున్న మనకు, దూరంలో వెలుగురేఖ కనపడుతోందని, దాన్ని చేరుకోడానికి మరింత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు.

అప్రమత్తత అవసరం..

కరోనా సమయంలో నిర్లక్ష్యంగా ఉన్నవారికి వైరస్ వెంటనే సోకింది. హోమ్ ఐసోలేష్, శానిటేషన్ పాటించినవారి దగ్గరకు వైరస్ వెళ్లలేకపోయింది. అయితే వైరస్ సోకిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృథా అనేది మాత్రం వాస్తవం. వైరస్ ని దాటుకుని బతికి బయటపడ్డవారు దానికి అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ జాడ కనిపిస్తున్నా అది సాధారణ జలుబులా మారిపోయింది. వైరస్ బలహీనపడటంతోపాటు, మన శరీరాలు దానికి పూర్తిగా అలవాటు పడ్డాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. అందుకే కరోనా కేసులు ఉన్నా కూడా కరోనా కారణంగా మరణాలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని వివరిస్తున్నారు. కరోనా కేసులు జీరో స్థాయికి చేరుకున్నా చేరుకోకపోయినా, కరోనా మరణాలు మాత్రం జీరో స్థాయికి చేరుకుంటాయని ధీమాగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన ఆసక్తిగా మారింది.

First Published:  24 Sep 2022 2:18 AM GMT
Next Story