Telugu Global
International

అమెరికా, చైనా మ‌ధ్య 2025లో యుద్ధం.. - అగ్ర‌రాజ్య‌ సీనియ‌ర్ సైనికాధికారి కీల‌క వ్యాఖ్య‌లు

తాజాగా ఇండో-ప‌సిఫిక్‌లో చైనా దుశ్చ‌ర్యల‌తో పాటు తైవాన్‌పై ఆ దేశం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అగ్రరాజ్యానికి మ‌రింత చికాకు క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మిన్‌హ‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

అమెరికా, చైనా మ‌ధ్య 2025లో యుద్ధం.. - అగ్ర‌రాజ్య‌ సీనియ‌ర్ సైనికాధికారి కీల‌క వ్యాఖ్య‌లు
X

అగ్ర‌రాజ్యం అమెరికా.. ఆ హోదా కోసం త‌హ‌త‌హ‌లాడుతున్న డ్రాగ‌న్ దేశాల మ‌ధ్య యుద్ధం జ‌ర‌గ‌బోతోందంట‌.. అదీ 2025లో అంట‌.. ఈ మాట చెబుతున్నది ఎవ‌రో కాదు.. అమెరికా సీనియ‌ర్ సైనికాధికారి జ‌న‌ర‌ల్ మైక్ మిన్‌హ‌న్‌. ఆయ‌న 50 వేల మంది సిబ్బంది ప‌నిచేసే ఎయిర్ మొబిలిటీ క‌మాండ్ (ఏఎంసీ) కి నేతృత్వం వ‌హిస్తున్నారు. ఈ విభాగంలో 500 విమానాలు ఉన్నాయి. సైనిక ద‌ళాల‌కు సంబంధించిన ర‌వాణా, ఇంధ‌న స‌ర‌ఫ‌రాను ఈ క‌మాండ్ ప‌ర్య‌వేక్షిస్తుంది. 2025లో అమెరికా, చైనా మ‌ధ్య యుద్ధం జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. త‌న అంచ‌నాలు త‌ప్ప‌య్యే అవ‌కాశాలూ ఉన్నాయని ఆయ‌న తెలిపారు.

అమెరికా, చైనా మ‌ధ్య కొన్ని సంవ‌త్స‌రాలుగా విభేదాలు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అవి వాణిజ్య యుద్ధం రూపంలో మ‌రింత ముదిరాయి. తాజాగా ఇండో-ప‌సిఫిక్‌లో చైనా దుశ్చ‌ర్యల‌తో పాటు తైవాన్‌పై ఆ దేశం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అగ్రరాజ్యానికి మ‌రింత చికాకు క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మిన్‌హ‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

2024లో అమెరికాలోను, తైవాన్‌లోను కూడా ఒకేసారి అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయని మిన్‌హ‌న్ త‌న విభాగంలోని స‌భ్యుల‌కు రాసిన ఓ లేఖ‌లో గుర్తుచేశారు. ఆ స‌మ‌యానికి అమెరికా దృష్టి ఇత‌ర అంశాల‌పై ఉంటుంద‌ని, దీనిని అనువుగా తీసుకుని చైనా తైవాన్‌పై ముందుకెళ్లే అవ‌కాశ‌ముంటుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. అందువల్ల త‌మ విభాగం యుద్ధానికి సిద్ధంగా ఉండాల‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తీసుకునే కీల‌క చ‌ర్య‌ల‌ను ఫిబ్ర‌వ‌రి 28లోగా త‌న‌కు నివేదించాల‌ని ఆయ‌న ఆదేశించారు.

అయితే మిన్‌హ‌న్ వ్యాఖ్య‌ల‌పై అమెరికా ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారి ఒక‌రు స్పందిస్తూ.. మిన్‌హ‌న్ వ్యాఖ్య‌లు అమెరికా ర‌క్ష‌ణ శాఖ వైఖ‌రిని ప్ర‌తిబింబించ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. వాయుసేన బ్రిగేడియ‌ర్ జ‌న‌ర‌ల్ ప్యాట్రిక్ రైడ‌ర్ మాట్లాడుతూ.. చైనాతో సైనిక పోటీ త‌మ ముందున్న ప్ర‌ధాన స‌వాల్ అని చెప్పారు. స్వేచ్ఛాయుత‌, శాంతియుత‌మైన ఇండో-ప‌సిఫిక్ కోసం మిత్ర‌దేశాలు, భాగ‌స్వాముల‌తో క‌లిసి ప‌నిచేయ‌డంపై తాము దృష్టి సారించామ‌ని ఆయ‌న తెలిపారు.

చైనా తైవాన్‌ను ఆక్ర‌మించేందుకు య‌త్నాలు చేస్తోంద‌ని తాము అనుమానిస్తున్నామ‌ని అమెరికా ర‌క్ష‌ణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ గ‌త నెల‌లో ఒక సంద‌ర్భంలో తెలిపారు. తైవాన్ జ‌ల‌సంధి వ‌ద్ద చైనా సైనిక కార్య‌క‌లాపాల‌ను ముమ్మ‌రం చేస్తుండ‌ట‌మే ఈ అనుమానాల‌కు తావిచ్చింద‌న్నారు. తైవాన్ ఆక్ర‌మ‌ణ‌కు చైనా సిద్ధ‌మ‌వుతోంద‌న‌డానికి దీనిని సంకేతంగా తాము భావిస్తున్నామ‌ని అప్ప‌ట్లో ఆయ‌న చెప్పారు. తాజాగా మిన్‌హ‌న్ చేసిన వ్యాఖ్య‌లు కూడా దీనిక‌నుగుణంగానే ఉండ‌టం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

First Published:  30 Jan 2023 4:18 AM GMT
Next Story