Telugu Global
International

విమాన ప్రమాదంలో వాగ్నర్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ మృతి.. ప్రమాదమా.. ప్రతీకారమా?

మాస్కోకు దాదాపు 100 కిలో మీటర్లు దూరంలోని తెవర్‌ ప్రాంతంలో ప్రయాణికులతో కూడిన జెట్‌ కూలినట్లు వెల్లడించింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్‌ కూడా ఉన్నట్లు తెలిపింది.

విమాన ప్రమాదంలో వాగ్నర్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ మృతి.. ప్రమాదమా.. ప్రతీకారమా?
X

సరిగ్గా రెండు నెలల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ దుర్మరణం పాలయ్యారు. ఓ ప్రైవేటు జెట్‌ కుప్పకూలడం వల్ల ప్రిగోజిన్‌ సహా 9 మంది మృతి చెందినట్లు రష్యా సివిల్ ఏవియేషన్‌ ఏజెన్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

మాస్కోకు దాదాపు 100 కిలో మీటర్లు దూరంలోని తెవర్‌ ప్రాంతంలో ప్రయాణికులతో కూడిన జెట్‌ కూలినట్లు వెల్లడించింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్‌ కూడా ఉన్నట్లు తెలిపింది.

ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో భాగంగా చాలకాలం పాటు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్‌ జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఆయన ప్రభుత్వంపై ఒక్కసారిగా ఎదురుతిరిగారు. పుతిన్‌ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రష్యా ఉలిక్కిపడింది. 24 గంటలపాటు ఉత్కంఠత నెలకొంది. అయితే బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్‌ బృందాల తిరుగుబాటుకు తెరపడింది. అయితే ఈ తిరుగుబాటు మొదలై, ముగిసిపోయిన నాటి నుంచి వాగ్నర్, దాని చీఫ్ ప్రిగోజిన్‌ భవితవ్యం చుట్టూ అనిశ్చితి చుట్టుముట్టింది.

అయితే ఇప్పుడు మాస్కో- సెయింట్ పీటర్స్ బర్గ్ మధ్య ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు విమానం కూలిపోయినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు గ్రే జోన్‌లోని వాగ్నర్‌తో అనుసంధానమైన ఒక టెలిగ్రామ్ ఛానల్ ప్రిగోజిన్ మరణించినట్లు ప్రకటించింది. అతన్ని హీరో, దేశభక్తుడిగా కీర్తించింది. అతను గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో మరణించాడని పేర్కొంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని వాగ్నర్ కార్యాలయాలు ఉన్న భవనం చీకటి పడిన తర్వాత ప్రిగోజిన్ మృతికి సంతాప సూచకంగా ఒక పెద్ద శిలువను ప్రదర్శించారు.

అయితే, ప్రిగోజిన్‌ మృతిపై తాజాగా జో బైడెన్‌ స్పందించారు. అక్కడ ఏం జరిగిందో తనకు కచ్చితంగా తెలియదని కానీ, ఈ వార్తలపై తాను ఆశ్చర్యపోలేదన్నారు. ఈ మరణం అందరూ ఉహించినదే అన్నారు.

*

First Published:  24 Aug 2023 8:06 AM GMT
Next Story