Telugu Global
International

ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా ఐరాస‌లో ఓటింగ్..భారత్ గైర్హాజరు

ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి లో జరిగిన ఓటింగ్ కు భారత్ గైర్హాజరయ్యింది. దీనిపై తీర్మానాన్ని అమెరికా, అల్బేనియాలు ప్రవేశపెట్టాయి.

ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా ఐరాస‌లో ఓటింగ్..భారత్ గైర్హాజరు
X

రష్యా నాలుగు ఉక్రేనియన్ భూభాగాలను స్వాధీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐక్య రాజ్య స‌మ‌తి భ‌ద్ర‌తామండ‌లిలో ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానంపై ఓటింగ్ కు భార‌త్ గైర్హాజ‌రైంది. వెంట‌నే హింస‌కు స్వ‌స్తి ప‌లికి చర్చల కు రావాల‌ని భార‌త్ పిలుపునిచ్చింది.

ఉక్రెయిన్ లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దుల్లోని ప్రాంతాలలో రష్యా చట్టవిరుద్ధంగా జ‌రుపుతున్న ప్రజాభిప్రాయ సేకరణను ఖండిస్తూ 15 స‌భ్య‌దేశాలు గ‌ల ఐరాస భ‌ద్ర‌తా మండ‌లిలో శుక్ర‌వారంనాడు అమెరికా, అల్బేనియాలు తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ తీర్మానంపై జ‌రిగిన ఓటింగ్ లో భార‌త్ పాల్గొన‌లేదు.

"రష్యా తాత్కాలిక నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ ప్రాంతాలైన లుహాన్స్క్, డోనెట్స్క్, ఖెర్సన్ , జపోరిజ్జియా ప్రాంతాలలో ర‌ష్యా ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 నుండి 27 వరకు చేప‌ట్టిన ప్రజాభిప్రాయ సేకరణ చ‌ట్ట విరుద్ధం, దానికి ఎటువంటి చెల్లుబాటు లేదు అని తీర్మానం పేర్కొంది. అలాగే ఉక్రెయిన్ లోని ఈ భూభాగాల స‌రివ‌హ‌ద్దుల‌లో ఎటువంటి మార్పులు ఉండ‌వ‌ని తెలిపింది.

ర‌ష్యా వీటో చేయడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. 15 దేశాల కౌన్సిల్‌లో, 10 దేశాలు తీర్మానానికి ఓటు వేయగా, చైనా, గాబన్, ఇండియా., బ్రెజిల్ దేశాలు గైర్హాజరయ్యాయి. దీనిపై యుఎన్‌లోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌లో ఇటీవలి పరిణామాలతో భారతదేశం తీవ్రంగా కలత చెందిందని, మానవ ప్రాణాలను పణంగా పెట్టడం వ‌ల్ల ఎటువంటి పరిష్కారమూ రాదని, దానివ‌ల్ల ప్రయోజ‌నం ఉండ‌ద‌నేదే భార‌త్ వైఖరని ఎప్పుడూ ఇదే విష‌యాన్ని చెబుతుంద‌ని అన్నారు.

"హింస, శత్రుత్వాలను తక్షణమే నిలిపివేయడానికి సంబంధిత పక్షాల ద్వారా అన్ని ప్రయత్నాలు చేయాలని మేము కోరుతున్నాము. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు భ‌యంక‌రంగా ఉన్న‌ప్ప‌టికీ విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి చ‌ర్చ‌లు ఒక్కటే ప‌రిష్కారం." ఆమె చెప్పారు.

First Published:  1 Oct 2022 11:01 AM GMT
Next Story