Telugu Global
International

వీడియో గేమ్స్ ఓకే.. వీడియోలతోనే ముప్పు

వీడియో గేమ్స్ ఆడటం వల్ల దుష్పరిణామాలేవీ లేవని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. అతి కొద్దిమందిలో వీడియో గేమ్స్ గ్రహణ శక్తిని మెరుగుపరుస్తాయని స్పష్టం చేశారు పరిశోధకులు.

వీడియో గేమ్స్ ఓకే.. వీడియోలతోనే ముప్పు
X

పిల్లలు అదే పనిగా వీడియో గేమ్స్ ఆడితే, వారి చదువుపై అదేమంత పెద్ద ప్రభావం చూపించదని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల తాజా అధ్యయనం స్పష్టం చేసింది. వీడియో గేమ్స్ వల్ల పిల్లల్లో గ్రాస్పింగ్ పవర్ ఏమాత్రం తగ్గదని తెలిపింది. అదే సమయంలో జ్ఞాన సముపార్జన శక్తి మెరుగుపడే అవకాశాలు కూడా లేవన్నది. వీడియో గేమ్స్ ఆడటం వల్ల దుష్పరిణామాలేవీ లేవని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. అతి కొద్దిమందిలో వీడియో గేమ్స్ గ్రహణ శక్తిని మెరుగుపరుస్తాయని స్పష్టం చేశారు పరిశోధకులు.

వీడియోలతోనే ముప్పు..

గతంలో వీడియో గేమ్స్ తో కాలక్షేపం చేసే పిల్లలు, ఇప్పుడు యూట్యూబ్ వీడియోలకు అలవాటుపడిపోతున్నారు. పదే పదే ఇలాంటి వీడియోలను స్వైప్ చేసుకుంటూ కాలం మరచిపోతారు. ఇలా వీడియోలకు బానిసలు కావడం వల్ల వారి సమయమంతా హరించుకుపోతుంది. చదువుకి కేటాయించాల్సిన సమయం కూడా యూట్యూబ్ కి కేటాయిస్తున్నారు పిల్లలు. ఇందులో మరో సమస్య ఏంటంటే.. వారు చూస్తున్న వీడియోల్లో చాలా వరకు రేటింగ్ కోసం కల్పిత వార్తలు ఉంటున్నాయి. ఏది మంచో, ఏది చెడో వారు నిర్థారించుకోలేక పోతున్నారు. అందుకే వీడియోలను చూసే అలవాటు పిల్లలకు మాన్పించాలన చెబుతున్నారు శాస్త్రవేత్తలు. శారీరక వ్యాయామం కూడా లేకపోవడంతో పిల్లలకు ఆరోగ్యకరమైన సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

రోజుకి నాలుగున్నర గంటలు..

రోజుకి సగటున నాలుగున్నర గంటలసేపు వీడియో గేమ్స్ కోసమో, మరే ఇతర ఎంటర్టైన్ మెంట్ కోసమో కంప్యూటర్లు లేదా సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు పిల్లలు. కొంతమంది మరింత ఎక్కువసేపు సెల్ ఫోన్ చూస్తున్నారు. సెల్ ఫోన్ చూడటం, ముఖ్యంగా పిల్లల్లో కేవలం టైమ్ వేస్ట్ ప్రక్రియే అంటున్నారు నిపుణులు. చదువులో అనుమానాల నివృత్తికోసం సెల్ ఫోన్ చూడటం మొదలు పెట్టినా, ఆ తర్వాత క్రమంగా వారు దారి తప్పుతున్నారని, చదువు పక్కనపెట్టి వినోదం కోరుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. సో.. వీడియో గేమ్స్ ఆడితే పిల్లల గ్రహణ శక్తి దెబ్బతినదు, అలాగని ఎక్కువసేపు వాటికే అంకితం అయితే చదువు వెనకపడి పోతుంది. కంప్యూటర్ గేమ్స్, వీడియో గేమ్స్ తప్పుకాదు, కానీ పరిమితికి లోబడితేనే ఏదైనా మంచిది.

First Published:  9 Feb 2023 2:36 AM GMT
Next Story