Telugu Global
International

ఆర్ధిక మాంద్యం దిశ‌లో బ్రిట‌న్‌..!?

బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్ధిక మాంద్యం ఎదుర్కో బోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బిఓఈ) వ‌డ్డీ రేట్ల‌ను 50 బేసిస్ పాయింట్ల‌ను పెంచిన నేపథ్యంలో ఈ అంచనాలు ఊపందుకున్నాయి.

ఆర్ధిక మాంద్యం దిశ‌లో బ్రిట‌న్‌..!?
X

బ్రిట‌న్ లో పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం నేప‌థ్యంలో భారీ ఆర్ధిక మాంద్యం ఎదుర్కోనున్న‌దా..? అంటే బ్యాంకుల అంచ‌నాలు అవుననే చెబుతున్నాయి. ఇటీవ‌ల ప్ర‌ముఖ‌ అంత‌ర్జాతీయ బ్యాంకులు తీసుకున్న చ‌ర్య‌ల‌తో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బిఓఈ) వ‌డ్డీ రేట్ల‌ను 50 బేసిస్ పాయింట్ల‌ను పెంచింది. 1995 నుండి ఇంత భారీగా పెంచ‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టికే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత యుకె సుదీర్ఘ మాంద్యం ఎదుర్కోబోతుంద‌ని బిఓఈ అంచ‌నా వేసింది. 1997లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు బ్రిటిష్ ప్రభుత్వం స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగించిన త‌ర్వాత ఇంత భారీగా వ‌డ్డీ రేట్లు పెర‌గ‌డం ఇదే తొలిసారి. వ‌ర‌స‌గా ఆర‌వ సారి పెరిగిన 0.5 శాతం పెంపుదలతో రుణ ఖ‌ర్చులు 1.75 శాతానికి పెరిగాయి.

గ‌త 60 యేళ్ల‌లో ఎన్న‌డూ లేని రీతిలో తీవ్ర ఆర్ధిక‌మాంద్యంతో పాటు ప్ర‌జ‌ల‌ జీవ‌న ప్ర‌మాణాల‌పై పెను ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని, యుకె, మిగిలిన ఐరోపా ప్రాంతంలోని ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఉటంకిస్తూ బ్యాంక్ పేర్కొంది. యుఎస్‌, లేదా యూరోజోన్ కంటే బ్రిటన్ చాలా బలహీనమైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఉంద‌ని బిఓఈ అంచనాలు సూచిస్తున్నాయి. ఆఖ‌రికి విద్యుత్ చార్జిల‌తో కూడా ప్ర‌జ‌లు షాకులు తింటున్నారు. బ్రెగ్జిట్ ప్రభావంతోనే యుకె ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదనే వాద‌న ఉంది.

ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికం నుండి గ‌రిష్ట మాంద్యంలోకి జారిపోతుందని, జిడిపి 2 శాతం కంటే ఎక్కువ తగ్గిపోతుంద‌ని బిఓఈ అంచ‌నా వేస్తోంది. ఎందుకంటే 2022, 2033లో గృహ పన్నుఅనంతర ఆదాయం బాగా పడిపోతుందని పేర్కొంది.

గ్యాస్ ధరలలో తాజా పెరుగుదల, సరఫరాలపై రష్యా ఆంక్షల కారణంగా యేడాది చివ‌రి నాటికి ద్రవ్యోల్బణం 13 శాతం కంటే ఎక్కువగా పెరుగుతుందని బ్యాంక్ అంచనా వేసింది. ఇది మే నెల‌లో బ్యాంక్ అంచనా వేసిన‌దాని కంటే చాలా ఎక్కువ. ద్రవ్యోల్బణం 2023 అంతటా "చాలా ఎలివేటెడ్ లెవెల్స్"లో ఉంటుంద‌ని పేర్కొంది.

యుకె, యూరప్‌లోని మిగిలిన ప్రాంతాలలో ఆర్థిక వృద్ధికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ అంచ‌నా మేర‌కు, రికవరీ ప్రారంభమైనప్పటికీ, వృద్ధి "చారిత్రక ప్రమాణాల ప్రకారం చాలా బలహీనంగా ఉంటుంది" అని సూచించింది. ఇదిలా ఉండ‌గా, గత వారం విడుదల చేసిన తాజా జిడిపి గణాంకాలు యుకె ఆర్థిక వ్యవస్థ రెండవ త్రైమాసికంలో 0.1 శాతం తగ్గిపోయిందని, ఇది ప్ర‌జ‌ల జీవన వ్యయ సంక్షోభాన్ని ప్రతిబింబిస్తుందని అంటున్నారు.

కాగా కన్జర్వేటివ్ పార్టీ త‌ర‌పున పోటీలో ఉన్న ఫేవరెట్ లిజ్ ట్రస్ స్పందిస్తూ.. తాను ప్రధానమంత్రి అయితే సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం అంచ‌నాల‌ను, దాని స్వ‌తంత్ర పరిధిని సమీక్షిస్తాన‌ని చెప్పారు. సునాక్ ఛాన్సలర్‌గా ప్రవేశపెట్టిన వరుస పన్నుల పెరుగుదల కారణంగానే బ్రిటన్‌ మాంద్యం దిశ‌గా నడుస్తోంద‌ని, దీనికి సునాక్ దే కొంత‌మేర‌కు బాధ్యత అని ట్రస్ విమ‌ర్శించారు

అయితే ట్ర‌స్ ప్రత్యర్థి అయిన రిషి సునక్ ఈ అంచ‌నాల‌పై స్పందిస్తూ... ద్రవ్యోల్బణం పెరుగుద‌ల అంచనాల‌ను బ‌ట్టి ట్రస్ రుణాలు పెంచడం,, పన్నులను తగ్గించడం వంటి వంటి విష‌యాల‌లో నిర్లక్ష్యంగా, అనాలోచితంగా వ్యవహరిస్తుందన్న తన వాదనను బలపరుస్తోంద‌ని అన్నారు. "బ్యాంకు ఈరోజు చర్యలు తీసుకుంది. కానీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోక త‌ప్ప‌దు అయితే అది మ‌రింత తీవ్రం కాకూడ‌దు. పెరుగుతున్న రుణాలు వడ్డీ రేట్లపై ఒత్తిడిని పెంచుతాయి." అని సునాక్ అన్నారు.

First Published:  17 Aug 2022 7:45 AM GMT
Next Story