Telugu Global
International

ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయింది.. కొత్త లోగో వచ్చేసింది

ట్విట్టర్ ని రీ బ్రాండింగ్ చేసేందుకు ఎలన్ మస్క్ కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా ట్విట్టర్ బుల్లిపిట్ట లోగోని 'X' అక్షరంతో రీప్లేస్ చేశారు.

ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయింది.. కొత్త లోగో వచ్చేసింది
X

కొత్త నిర్ణయాలు ఎంత వేగంగా తీసుకుంటారో, అంతే వేగంగా వాటిని అమలు చేస్తారు ఎలన్ మస్క్. ట్విట్టర్ కొనుగోలు తర్వాత తనదైన చిత్ర విచిత్ర నిర్ణయాలతో యూజర్లకు షాకుల మీద షాకులిచ్చిన ఎలన్ మస్క్ తాజాగా ట్విట్టర్ లోగో మార్చేశారు. లోగో మార్పుపై నిన్న ప్రకటన రాగా.. ఈరోజు అది అమలులోకి వచ్చేసింది. ట్విట్టర్ పిట్ట పూర్తిగా తెరమరుగైంది. దాని స్థానంలో 'X' సింబల్ ని హోమ్ పేజీలో చేర్చేశారు ఎలన్ మస్క్. లోగో మార్పు ఊహించినదే అయినా.. అది మారిపోయిన తర్వాత నెటిజన్లు నిజంగానే షాకవుతున్నారు.


ట్విట్టర్ ని రీ బ్రాండింగ్ చేసేందుకు ఎలన్ మస్క్ కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. చైనాకు చెందిన వుయ్‌ చాట్‌ తరహాలో అన్నింటికీ పనికొచ్చే ‘ఎక్స్‌’ యాప్‌ ను రూపొందించాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ముందుగా ట్విట్టర్ బుల్లిపిట్ట లోగోని 'X' అక్షరంతో రీప్లేస్ చేశారు.

రిప్ ట్విట్టర్ అనే హ్యాష్ ట్యాగ్ ఈరోజు ఉదయం వరకు ట్రెండింగ్ లో ఉంది. కొత్తగా 'X' పేరు తెరపైకి రావడం కొత్త లోగో కూడా కనపడటంతో ట్విట్టర్'X' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చి చేరింది. కొత్త లోగోపై చాలామంది నెటిజన్లు పెదవి విరిచారు. ట్విట్టర్ పక్షి ఇక గత చరిత్రేనా అంటూ విషాదంలో మునిగిపోయారు.

ఎందుకీ 'X'

ఎలాన్‌ మస్క్‌ గత ఏడాది ట్విట్టర్‌ ను కొనుగోలు చేశారు. సంస్థలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్‌ బిజినెస్‌ పేరును ఎక్స్‌ కార్పొరేషన్‌గా మార్చారు. ట్విట్టర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎక్స్‌ కార్పొరేషన్‌లో చట్టబద్ధంగా విలీనమైంది. ట్విట్టర్ కి పోటీగా ఇటీవల మెటా సంస్థ థ్రెడ్స్ యాప్ ని తెరపైకి తీసుకు రావడంతో మస్క్ లో కసి మరింత పెరిగింది. అన్నిటికీ పనికొచ్చే సోషల్ మీడియా యాప్ గా ట్విట్టర్ ని తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు. ఇది కేవలం సోషల్‌ మీడియా వేదికగానే కాకుండా ఆన్‌ లైన్‌ చెల్లింపులకు, ఆహారాన్ని ఆర్డర్‌ చేయడానికి పనికొస్తుందని అంటున్నారు. ముందు ముందు 'X'లో మరిన్ని మార్పులు రాబోతున్నాయి.

First Published:  24 July 2023 10:16 AM GMT
Next Story